ఖిలాడి గ్రీష్మ: పక్కా ప్లాన్‌తో ప్రియుడి హత్య.. ఇప్పుడేమో మరో డ్రామా?!

31 Oct, 2022 16:04 IST|Sakshi

క్రైమ్‌: సంచలనం సృష్టించిన షరోన్‌ రాజ్‌(23) హత్య కేసులో.. ఊహించని పరిణామం నెలకొంది. ప్రియుడ్ని పక్కా ప్లాన్‌తో హత్య చేసిందని భావిస్తున్న యువతి(22).. పోలీస్‌ స్టేషన్‌లోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ పరిణామాన్ని కూడా డ్రామాగానే అనుమానిస్తుండడం గమనార్హం. 

తిరువనంతపురం పరసాలాకు చెందిన షరోన్‌ రాజ్‌(23)ను ప్రేమించిన ఉష అలియాస్‌ గ్రీష్మ(22)కు..  మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. అది తెలిసి ఆమెకు షరోన్‌ ఆమెకు కొన్నాళ్లు దూరంగా ఉన్నాడు. అయితే.. కావాలనే అతనికి మళ్లీ వాట్సాప్‌ ద్వారా దగ్గరైంది గ్రీష్మ. ఈ క్రమంలో అక్టోబర్‌ 14వ తేదీన ఇంటికి పిలిచి మరీ స్లోపాయిజన్‌ ఇచ్చి.. అతన్ని ఆస్పత్రిపాల్జేసింది. రెండు వారాల పాటు నరకం తర్వాత.. చికిత్స పొందుతూ గత సోమవారం అతను ఆస్పత్రిలోనే మరణించాడు. అయితే.. 

ఈ ఘటన తర్వాత నిందితురాలి కుటుంబం పరారు కాగా.. ఎట్టకేలకు ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న ఉష.. అరెస్ట్‌ ముందర ఉత్కంఠకు తెర తీసింది. సోమవారం ఉదయం ఆత్మహత్యకు ప్రయత్నించిందని స్థానిక మీడియా ఛానెల్స్‌ కథనాలు వెలువరించాయి. ఆస్పత్రి బాత్‌రూంలో ఉన్న ఫ్లోర్‌ క్లీనింగ్‌ లిక్విడ్‌ను తాగి.. ఆమె అపస్మారక స్థితికి వెళ్లిందని.. ఆపై వాంతులు చేసుకుంటూ పోలీస్‌ జీపు వైపు అడుగులేసిందని.. ఈ క్రమంలో ఆమెను గమనించిన సిబ్బంది వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. 

అయితే.. క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు గ్రీష్మ ఆత్మహత్యాయత్నాన్ని ఫేక్‌గా భావిస్తున్నారు. సింపథీ దక్కించుకోవడం, బయటకు వచ్చేందుకు ఆమె ఈ ప్రయత్నం చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు.. ఆమె కుటుంబానికి దగ్గరి బంధువైన వైద్యుడే.. ఆస్పత్రిలో ఆమెకు చికిత్స(డ్రామా) అందించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో.. గ్రీష్మ కస్టడీని పర్యవేక్షిస్తున్న అధికారులను సైతం క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం.. రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)కు చెందిన గ్రీష్మ అలియాస్‌ ఉష.. కేరళ తిరువనంతపురం పరసాలాకు చెందిన షరోన్‌ రాజ్‌తో ప్రేమలో ఉండేది. అయితే ఆమెకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో.. షరోన్‌ ఆమెను కలిసి దిగిన ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పి.. అంతా కలిసి పక్కా ప్లాన్‌తోనే షరోన్‌ను ఇంటికీ రప్పించి మరీ పురుగుల మందు లాంటి ద్రావణాన్ని బహుశా  కషాయంలో కలిపి తాగించి హత్య చేశారు. 

అయితే.. గ్రీష్మకు పెళ్లైన కొన్నాళ్లకే భర్త చనిపోతాడని జ్యోతిష్యుడు చెప్పాడని, అందుకే వివాహాన్ని ఫిబ్రవరి దాకా వాయిదా వేసుకుందని షరోన్‌ కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో షరోన్‌ ద్వారా ఆ గండం తొలగించుకుందని ఆరోపిస్తోంది. ఈ మేరకు మూఢనమ్మకంతోనే తమ బిడ్డను హత్య చేయించిందని గ్రీష్మ కుటుంబంపై ఫిర్యాదు చేసింది. విశేషం ఏంటంటే.. కషాయంలో కలిపిన మందు ఏంటన్నదానిపై పోలీసులు ఇప్పటిదాకా ఒక నిర్ధారణకు రాకపోవడం!.

మరిన్ని వార్తలు