అట్టడుగు వర్గాలకే అధిక ప్రాధాన్యం

1 Feb, 2022 01:26 IST|Sakshi
పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

ఆ దిశగానే కేంద్ర విధానాలు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశంలో ఉద్ఘాటన

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాలు సమాజంలోని పేదలు, అట్టడుగు వర్గాలకు, షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు, గ్రామ సీమల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చెప్పారు.  మొత్తం రైతుల్లో 80 శాతం ఉన్న సన్నకారు రైతుల అభివృద్ధిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటం, రికార్డు స్థాయిలో పంటల సేకరణ, దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేయడానికి చేపట్టిన చర్యలు మన సమష్టి విజయాలని చెప్పారు.

దీర్ఘకాలంలో సాధించాల్సిన లక్ష్యాలకు ఇవి చోదక శక్తిగా పని చేస్తాయని అన్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన సోమవారం ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన పలు ఘనతలను ప్రస్తావించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యేకంగా గుర్తుచేశారు.

గోవా విముక్తి పోరాట యోధుల స్మారకం నిర్మాణం, అఫ్గానిస్తాన్‌ నుంచి గురుగ్రంథ సాహిబ్‌ స్వరూపాలను వెనక్కి తీసుకురావడం, భారత్‌లో రైతాంగం సాధికారత కోసం సర్కారు కృషి వంటి అంశాలు రాష్ట్రపతి ప్రసంగంలో చోటుచేసుకున్నాయి. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’లో భాగంగా 2020–21లో రక్షణ రంగం ఆధునీకరణకు 87 శాతం అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. 209 రకాల రక్షణ పరికరాలను దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవాలని నిర్ణయించినట్లు గుర్తుచేశారు.

దేశ భవిష్యత్తుకు రోడ్డుమ్యాప్‌
కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను దేశ భవిష్యత్తుకు రోడ్డుమ్యాప్‌గా భావించాలని రాష్ట్రపతి కోవింద్‌ ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు, సైంటిస్టులు నిరుపమాన సేవలందించారని కొనియాడారు. ఏడాది కంటే తక్కువ సమయంలోనే 150 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు ప్రజలకు అందజేయడం గొప్ప విషయమని చెప్పారు.

దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 90 శాతానికి పైగా ప్రజలు టీకా మొదటి డోసు, 70 శాతానికి పైగా ప్రజలు రెండు డోసులు తీసుకున్నారని తెలిపారు. 15–18 ఏళ్ల కేటగిరీకి కరోనా టీకా ఇస్తున్నట్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, వృద్ధులకు బూస్టర్‌ డోసు ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యిందని గుర్తుచేశారు.

అతిపెద్ద ఆహార పంపిణీ పథకం
కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’ కింద పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేసిందని రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. 19 నెలల్లో 80 కోట్ల మంది లబ్ధి పొందారని, దీని కోసం ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ పథకమని వివరించారు.

దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ‘పీఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌’ను తెరపైకి తెచ్చిందని తెలిపారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారీ పెదవి విరిచారు. చైనా, పాకిస్తాన్‌ వ్యవహారాన్ని రాష్ట్రపతి ప్రస్తావించలేదని, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణ, నాగాలాండ్‌లో పౌరుల ఊచకోతపై ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు.   

రాజ్యసభలో ఆర్థిక సర్వే
ఆర్థిక సర్వే 2021–22 నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అంతకముందు తొలుత సభ ప్రారంభం కాగానే చైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు సిట్టింగ్‌ ఎంపీ డాక్టర్‌ మహేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీలు జయంత రాయ్, దేబేంద్రనాథ్‌ బర్మన్, ఎం.మోజెస్, గణేశ్వర్‌ కుసుమ్, కథక్‌ కళాకారుడు పండిట్‌ బిర్జూ మహారాజ్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. పార్లమెంట్‌ 255వ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల జాబితాను సెక్రెటరీ జనరల్‌ రాజ్యసభకు సమర్పించారు. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రకటించారు.

సభా హక్కుల ఉల్లంఘన...
పెగాసస్‌ స్పైవేర్‌ సమస్యపై గత ఏడాది పార్లమెంట్‌లో ప్రకటన చేసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌పై ప్రివిలేజ్‌ మోషన్‌ను ప్రవేశపెట్టాలని సీపీఐ ఎంపీ బినోయ్‌ విశ్వం సోమవారం నోటీసు సమర్పించారు. ఇటీవల న్యూయార్క్‌ టైమ్స్‌ రిపోర్టును ఆధారంగా నోటీసును సమర్పించినట్లు తెలిపారు. స త్యాన్ని దాచడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, పెగాసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందన్న ఆధారాలు బహిర్గతం అయ్యాయన్నారు.

పెగాసస్‌పై ప్రత్యేక చర్చ అక్కర్లేదు  
పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. ఈ అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉందని వెల్లడించింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు కోరుకుంటే ఏ అంశాన్ని అయినా లేవనెత్తవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ అన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ అక్కర్లేదన్నారు. 

మరిన్ని వార్తలు