ముగిసిన బడ్జెట్‌ పార్లమెంట్‌

26 Mar, 2021 04:06 IST|Sakshi

13 రోజుల ముందే ముగిసిన సమావేశాలు

కీలక బిల్లులు ఆమోదం

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల నాయకులు ఎన్నికల ప్రచారం కోసం సమయం అవసరమని విజ్ఞప్తి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 13 రోజుల ముందే సమావేశాలను ముగించారు. జనవరి 29న ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 8 వరకు జరగాల్సి ఉండగా, ముందే, గురువారం, మార్చి 25వ తేదీన నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూడా కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. లోక్‌సభ సమావేశాలు సజావుగా సాగడంపై స్పీకర్‌ ఓం బిర్లా ఒక ట్వీట్‌లో హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో ముఖ్యమైన పలు బిల్లులు సభ ఆమోదం పొందాయన్నారు.  ఈ సమావేశాల్లో మొత్తం 20 బిల్లులను ప్రవేశపెట్టగా.. 18 బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. బడ్జెట్‌ సమావేశాల తొలి విడతలో ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

అనంతరం, రెండో విడత సమావేశాలు మార్చి 8న ప్రారంభమయ్యాయి. ఈ విడతలో ఢిల్లీలో ఎల్జీకి మరిన్ని అధికారాలు కల్పించే బిల్లు, బీమా సవరణ బిల్లు తదితర కీలక బిల్లులు సభ ఆమోదం పొందాయి. మొత్తంగా ఈ సమావేశాల్లో లోక్‌సభ ఉత్పాదకత 114%గా ఉంది. 14 గంటల 42 నిమిషాల పాటు జరిగిన బడ్జెట్‌పై చర్చలో 146 మంది సభ్యులు పాల్గొన్నారు. కరోనా ముప్పు కారణంగా, మొదట  రాజ్యసభ సమావేశాలను ఉదయం, లోక్‌సభ సమావేశాలను సాయంత్రం నిర్వహించారు. కానీ, మార్చి 9వ తేదీ నుంచి ఉభయ సభలు కూడా ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై, బడ్జెట్‌పై రాజ్యసభలో లోతైన, నాణ్యమైన చర్చ జరిగిందని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో కోవిడ్‌ నిబంధనలను సభ్యులంతా పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. రెండు విడతల బడ్జెట్‌ సమావేశాల్లో మొత్తంగా 90% ఉత్పాదకతతో రాజ్యసభ 104 గంటల 23 నిమిషాల పాటు జరిగిందన్నారు.

మరిన్ని వార్తలు