లఖీంపూర్‌ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ

16 Dec, 2021 05:53 IST|Sakshi

అజయ్‌ మిశ్రాకు ఉద్వాసన పలకాలి

విపక్షాల డిమాండ్‌

స్తంభించిన కార్యకలాపాలు

గురువారానికి వాయిదా

న్యూఢిల్లీ: లఖీంపూర్‌ ఖేరిలో ముందస్తు కుట్రతోనే రైతులను బలితీసుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తేల్చడంతో విపక్షాలు బుధవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రాకు ఉద్వాసన పలకాలని విపక్షాలు లోక్‌సభలో గట్టిగా డిమాండ్‌ చేశాయి. నినాదాలతో లోక్‌సభ దద్దరిల్లింది. విపక్ష సభ్యులు పట్టువీడకుండా నిరసనలు కొనసాగించడంతో సభ గురువారానికి వాయిదా పడింది.

బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలు విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసకెళ్లి మిశ్రాపై వేటు వేయాలని బిగ్గరగా నినాదాలు చేశారు. సిట్‌ తాజాగా వెల్లడించిన సంచలన విషయాల తాలూకు వార్తా కథనాలు కనిపించేలా ప్రతికలను చేతులతో పట్టుకొని గాల్లో ఊపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి సిట్‌ దర్యాప్తులో వెల్లడైన విషయాలపై చర్చించాలని వాయిదా తీర్మానానికి రాహుల్‌ గాంధీ నోటీసు ఇచ్చారు. దీన్ని అనుమతించాలని కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ బిర్లా వీరి డిమాండ్‌ను పట్టించుకోకుండా∙విపక్ష ఎంపీల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలను కొనసాగించారు.

విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్నాహ్యం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేమైన తర్వాత ఇవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. ‘ధరల పెరుగుదలపై ముఖ్యమైన చర్చ ఉంది. ఈ అంశాన్ని చర్చకు చేపట్టాలనేది మీ డిమాండే కదా. మీ స్థానాల్లోకి వెళ్లి కూర్చొండి’ అని స్పీకర్‌ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ విజ్ఞప్తి చేశారు. అయినా లాభం లేకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. పన్నెండు మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ విపక్షాలు తమ ఆందోళనను కొనసాగించడంతో రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది.   

కుదించే ఆలోచన ప్రస్తుతానికి లేదు
పార్లమెంటు శీతాకాల సమావేశాలను కుదించే ఆలోచన ప్రస్తుతానికైతే లేదని పార్లమెంటరీ వ్యవ హారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. ‘ధరల పెరుగుదల, ఒమిక్రాన్‌ ముప్పు లాంటి ముఖ్యమైన అంశాలపై చర్చించాలన్న విపక్షాలు తీరా ఇవి చర్చకు వస్తే పాల్గొనకుండా పారిపోవడం విడ్డూరం. ఈ అంశాల్లో మాట్లాడటానికి వారికి ఏమీ లేనట్లే కనపడుతోంది. సమావేశాల నిడివిని కుదిస్తారని పుకార్లను వ్యాప్తి చేయడంలో ప్రతిపక్షాలు బిజీగా ఉన్నాయి’ అని విలేకరులతో అన్నారు.

మరిన్ని వార్తలు