Parliament Monsoon Session 2021: లైవ్‌ అప్‌డేట్స్‌

19 Jul, 2021 11:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను సభ్యులందరూ అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ సమావేశాలు పత్యక్షంగా జరపటం సంతోషకరమన్నారు.

లోక్‌సభలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల ఆందోళన
లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. పోలవరంపై చర్చకు వైఎస్సార్‌సీపీ ఎంపీల పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేశారు. 

రాజ్యసభలో వైఎస్సార్‌ సీపీ ఎంపీల ఆందోళన
రాజ్యసభలో వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ఆందోళన చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రత్యేక హోదా, పోలవరం అంశాలపై చర్చించాలని పట్టుపట్టారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళనతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.

ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు వైఎస్సార్‌ సీపీ నోటీసు
రాజ్యసభ: ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు వైఎస్సార్‌ సీపీ నోటీసు ఇచ్చింది. ఎంపీ విజయసాయిరెడ్డి రూల్ 267 కింద ఛైర్మన్‌కు నోటీసు అందజేశారు. ప్రత్యేక హోదా అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశం. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించారు.. ఏపీకి ప్రత్యేక హోదాపై 2014లో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఆమోదం తెలిపి ఏడేళ్లైనా కేంద్ర కేబినెట్‌ ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు.. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించాలని ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు.

రాజ్యసభలో గందరగోళం
రాజ్యసభలో గందరగోళం  నెలకొంది. కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి.  విపక్షాల తీరుపై ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఉభయ సభలు వాయిదా..
లోక్‌సభలో విపక్షాల ఆందోళన మధ్యే ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేబినెట్‌లో ఎస్సీలు, మహిళల ప్రాతినిధ్యం శుభపరిణామమన్నారు. అనంతరం ఇటీవల మరణించిన ఎంపీలకు లోక్‌సభ సంతాపం తెలిపింది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలను విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల ఆందోళనలతో మధ్యాహ్నం 2 వరకు లోక్‌సభ వాయిదా పడింది.

రాజ్యసభలో ఇటీవల మరణించిన మాజీ ఎంపీలకు సభ్యులు నివాళులు అర్పించారు. ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ మృతిపై రాజ్యసభ సంతాపం తెలిపింది. అనంతరం మధ్యాహ్నం 12:24 వరకు రాజ్యసభ వాయిదా పడింది.

లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన 
పోలవరం అంచనా వ్యయం ఆమోదించాలని వైఎస్సార్‌ సీపీ.. పెట్రోల్‌ ధరల పెంపుపై కాంగ్రెస్.. వ్యాక్సినేషన్, ఆర్ధిక వృద్ధి పతనంపై టీఎంసీ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.

పార్లమెంట్‌ వద్ద రైతు చట్టాలకు వ్యతిరేకంగా అకాలీదళ్ ఎంపీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

లోక్‌సభలో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ప్రమాణం
లోక్‌సభలో ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన నలుగురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ప్రధాని మోదీ కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు.

ఈ సమావేశాల సందర్భంగా కేంద్రం 17 కొత్త బిల్లులతో సహా మరో 2 ఆర్థిక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇటీవల జారీ చేసిన 3 ఆర్డినెన్స్‌లకు చట్టరూపం ఇవ్వనుంది. ప్రతి పక్షాలు పెట్రో ధరల పెంపు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ప్రభుత్వ వైఫల్యం.. సాగు చట్టాలు, రైతుల ఆందోళన వంటి అంశాలపై ప్రశ్నించనున్నారు.

మరిన్ని వార్తలు