Parliament session: పార్లమెంట్‌లో అదే అలజడి.. కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన 

2 Aug, 2022 04:54 IST|Sakshi
ధరల పెరుగుదలను నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ సభ్యులు

దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం

నలుగురు లోక్‌సభ సభ్యులపై సస్పెన్షన్‌ ఎత్తివేత, ధరలపై చర్చ 

న్యూఢిల్లీ:  నిత్యావసరాల ధరల పెరుగుదల, లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు సోమవారం కూడా ఆందోళన కొనసాగించాయి. దీంతో రెండు సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టడంతో ధరల పెరుగుదలపై లోక్‌సభలో చర్చ జరిగింది. దీనిపై మంగళవారం రాజ్యసభ కూడా చర్చించనుంది.

సభ గౌరవాన్ని తగ్గించొద్దు: స్పీకర్‌  
లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. తమ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. సభ గౌరవాన్ని తగ్గించే పని చేయొద్దని స్పీకర్‌ ఓం బిర్లా కోరినప్పటికీ వెనక్కి తగ్గలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమైనా విపక్షాలు నినాదాలు ఆపలేదు.

కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటోందని మండిపడ్డారు. దాంతో సభ మధ్యాహ్నం రెండింటిదాకా వాయిదా పడింది. పునఃప్రారంభమైన తర్వాత కూడా అవే దృశ్యాలు కనిపించాయి. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయొద్దు, ఇది ఈడీ సర్కారు అంటూ కాంగ్రెస్‌ సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. డీఎంకే, ఎన్సీపీ సభ్యులు వారికి మద్దతుగా నిలిచారు. 

సభలోకి ఇకపై ప్లకార్డులు తీసుకురాబోమని నలుగురు కాంగ్రెస్‌ ఎంపీలు హామీ ఇవ్వడంతో వారిపై సస్సెన్షన్‌ను ఎత్తేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సభ్యులను హెచ్చరించారు. సభాపతి స్థానాన్ని అగౌరవపర్చాలన్న ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదని కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల వినతిని ప్రభుత్వం వినకపోవడం వల్లే నిరసన తెలపాల్సి వస్తోందన్నారు.   

రాజ్యసభలోనూ అవే సీన్లు
శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అరెస్టు తదితరాలపై ప్రతిపక్షాలు రాజ్యసభను స్తంభింపజేశాయి. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఆందోళనకు దిగాయి. దాంతో సభ మధ్యాహ్నం 12 దాకా వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభ్యులు శాంతించలేదు. వెల్‌లోకి చేరుకొని, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభా సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రతిపక్షాలను కోరారు. ధరల పెరుగుదలపై మంగళవారం సభలో చర్చిస్తామన్నారు.

గుజరాత్, మహారాష్ట్ర, అస్సాంలో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్‌ ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపర్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సభలో విపక్షాల నిరసనల మధ్యే ఖాదీ, జీడీపీలో వీధి వ్యాపారుల పాత్ర, నదుల స్వచ్ఛీకరణ, అభివృద్ధిపై చర్చను చేపట్టారు. నినాదాల హోరు పెరగడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత కూడా సభ అదుపులోకి రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది.  

మాంద్యానికి అవకాశం లేదు: నిర్మల
భారత్‌లో ఆర్థిక మాంద్యం గానీ, ఆర్థిక మందగమనం గానీ ఏర్పడే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో చెప్పారు. ధరల పెరుగుదలపై చర్చలో ఆమె మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా మారుతోంది అని చెప్పడానికి జీఎస్టీ వసూళ్లు, కొనుగోలు సూచికే(పీఎంఐ) సాక్ష్యమని వివరించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరేళ్ల బాలిక ప్రధాని మోదీకి రాసిన లేఖ గురించి ప్రస్తావించారు.

మోదీపై నమ్మకం ఉంది కాబట్టే లేఖ రాసిందని అన్నారు. ప్రభుత్వ చర్యలు, విధానాల వల్ల ఇటీవల వంట నూనెల ధరలు తగ్గిపోయాయని ఉద్ఘాటించారు. ఆర్థిక మంత్రి సమాధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ లోక్‌సభ నుంచి కాంగ్రెస్, డీఎంకే, టీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు. ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా తరహాలో దేశంలో ద్రవ్యోల్బణం లేదు’ అని కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారీ ఎద్దేవా చేశారు.

పచ్చి కూరగాయలు తినాల్సిందే
ధరల పెరుగుదలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కకోలీ ఘోష్‌ దస్తీదార్‌ లోక్‌సభలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ధరల పెరుగుదలపై చర్చ జరుగుతుండగా హఠాత్తుగా లేచి పచ్చి వంకాయను ప్రదర్శించారు. వంట గ్యాస్‌ ధర విపరీతంగా పెరగడంతో పచ్చి కూరగాయలు తిని కడుపు నింపుకోవాల్సిందేనంటూ వంకాయను కొరికి నిరసన వెలిబుచ్చారు.

మరిన్ని వార్తలు