Union Budget 2022 Live Updates: ఉభయ సభలు మంగళవారానికి వాయిదా

31 Jan, 2022 19:33 IST|Sakshi

అప్‌డేట్స్‌

04:00 PM

 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 2021-22 ఆర్థిక సర్వేను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం రాజ్యసభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా ఇంతకు ముందు ఆర్థిక సర్వేను మంత్రి నిర్మలా లోక్‌సభలో సమర్పించారు. 

12: 55 PM

 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ ఎకానామిక్‌ సర్వే 2021-22 ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.

11: 55 AM

► పార్లమెంట్‌ సెంట్రల్‌ హల్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 75 సంవత్సరాల ఆజాదీకా అమృత్‌.. ఒక పవిత్ర మహోత్సవమని వచ్చే 25 ఏళ్లు అదే స్ఫూర్తితో మనమంతా పనిచేయాల​న్నారు. అదే విధంగా, వ్యాక్సిన్‌తో కరోనాను కట్టడి చేయబోతున్నామని తెలిపారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల సేవలు ప్రశంసనీయమన్నారు. దేశంలో పేదలకు ఉచితంగా రేషన్‌ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

► భారత్‌ గ్లోబల్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా మారుతోందన్నారు. దేశంలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయని పేర్కొన్నారు. భారీగా వస్తున్న ఎఫ్‌డీఐలు దేశ అభివృద్ధిని సూచిస్తున్నాయని తెలిపారు. మేకిన్‌ ఇండియాతో మొబైల్‌ పరిశ్రమ వృద్ధి చెందుతోందన్నారు.

► ఫసల్‌ బీమాతో సన్నకారు రైతులకు ప్రయోజం లభిస్తోందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈల చేయూత కోసం 3 లక్షల కోట్ల రుణాలు కేటాయించినట్లు తెలిపారు.

► 7 మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లతో యువతకు భారీగా ఉద్యోగాల కల్పన చేసినట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ తెలిపారు. ఈ ఏడాది 10 రాష్ట్రాల్లో 19 బీటెక్‌ కాలేజీల్లో 6 స్థానిక భాషలలో బోధన జరుగుందని రామ్‌నాథ్‌ పేర్కొన్నారు.

► పీఎమ్‌గ్రామీణ సడక్‌ యోజనలతో రోజుకు 100 కి.మీ రహదారుల నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ తెలిపారు.

► ప్రస్తుతం భారతదేశం మూడో దశ కొవిడ్‌ను ఎదుర్కొంటుందన్నారు. భారత్‌లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని రాష్టపతి తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఏడాది కాలంలో 160 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం భారతదేశం మూడో దశ కోవిడ్‌ను ఎదుర్కొంటుందన్నారు.

► భారత్‌లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని రాష్ట్రపతి తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలిచిందన్నారు. కోవిడ్‌ ఎదుర్కోవడానికి దేశ ఫార్మారంగం ఎంతో కృషి చేసిందన్నారు. ఫార్మా పరిశ్రమను విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 

► పేదల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఆయుష్మాన్‌ భారత్‌  పథకం ఎంతో ఉపయోగపడిందన్నారు. డబ్ల్యూహెచ్‌వో తొలి ట్రెడిషనల్‌ మెడిసిన్‌ సెంటర్‌ భారత్‌లో ఏర్పాటు కాబోతుందని పేర్కొన్నారు. అదే విధంగా పద్మపురస్కారాలను సామాన్యుల వరకు తీసుకెళ్లినట్లు వివరించారు.

► ప్రధాని గరీబ్‌యోజన పథకం ద్వారా 19 నెలల పాటు పేదలకు ఉచితంగా రేషన్‌ ఇచ్చినట్లు తెలిపారు. ప్రపంచంలో భారత్‌  అతిపెద్ద ఆహార సరఫరా సంస్థ అని రాష్ట్రపతి తమ ప్రసంగంలో పేర్కొన్నారు. 

11: 04 AM

► పార్లమెంట్‌లో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయులకు స్వాతంత్ర్య, అమృతోత్సవ్‌ శుభాకాంక్షలు తెలిపారు. కరోనాపై భారత్‌ పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. 

10: 54 AM

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్లమెంట్‌ భవనంకు చేరుకున్నారు.

10.: 45 AM

పార్లమెంట్‌ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి ఇది కీలక సమయమని, బడ్జెట్‌ సమావేశాలకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా పెగాసస్, రైతు ఆందోళనలు, చైనా దురాక్రమణలు సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై దృష్టి సారించింది. సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషీ, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు వేర్వేరుగా విపక్ష నేతలతో సమావేశమవుతారు.

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలోనే బడ్జెట్‌ సమావేశాలు జరగడం ఆసక్తికరంగా మారింది. బడ్జెట్‌ సమావేశాలు ఆయా రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఆర్థిక, రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రపతిగా కోవింద్‌ చివరి ప్రసంగం
సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను సంయుక్తంగా ఉద్దేశించి ప్రసంగిస్తారు. వచ్చే జూలైలో రాష్ట్రపతిగా కోవింద్‌ పదవీ కాలం పూర్తికానుంది. దీంతో ఈ సమావేశాలే ఆయన రాష్ట్రపతి హోదాలో చివరిగా ప్రసంగించే పార్లమెంట్‌ సమావేశాలు. రాష్ట్రపతి ప్రసంగానంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వే 2021–22ను, మంగళవారం(ఫిబ్రవరి 1) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

బుధవారం నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే అంశంపై చర్చ ఆరంభమవుతుంది. ఈ చర్చ సుమారు 4 రోజులు జరగవచ్చు. ఫిబ్రవరి 7న ఈ చర్చకు ప్రధాని బదులిస్తారు. తొలి దశ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరుగుతాయి. రెండో దశ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 8 వరకు జరుగుతాయి.

మరిన్ని వార్తలు