Parliament Winter Session 2021: 3 ప్రైవేట్‌ బిల్లులను ప్రవేశపెట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి

3 Dec, 2021 10:56 IST|Sakshi

Live Updates:

► దేశంలో పెట్టుబడుల ఉపసంహరణపై లోక్‌సభలో టీఎంసీ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. లాభాల్లో ఉన్న పీఎస్‌యూలను అమ్మేయడం వలన వందల మంది ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయన్నారు. నష్టాల్లో ఉన్న వాటిని అమ్మేసిన పర్వాలేదు.. కానీ లాభాల్లో ఉన్న వాటిని పీపీపీ మోడ్‌లోకి తీసుకురావాలంటూ నుస్రత్‌ కేంద్రాన్ని కోరారు. 

► రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి మూడు ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులను ప్రవేశపెట్టారు. బాలల ఉచిత, నిర్బంధ విద్యాహక్కుచట్ట సవరణ బిల్లు, గ్రాడ్యుయేట్లు నిరుద్యోగ భృతి పొందే హక్కును కల్పించేలా రాజ్యాంగ సవరణ బిల్లులను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు. వీటితో పాటు ప్రార్థనా మందిరాలపై దాడులు చేసేవారికి విధించే గరిష్ట జైలు శిక్షను రెండేళ్ల నుంచి ఇరవై ఏళ్లకు పెంచేలా ఐపీసీ చట్ట సవరణ - 2021 బిల్లులను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు. 

దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్‌ లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న సీఎస్‌యూలను అమ్మేయడం సరికాదని.. దీనివల్ల వందలమంది ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్టేక్ అమ్మేయడం కాకుండా, వాటిని పీపీపీ మోడ్‌లోకి తీసుకురావాలని ఆమె కేంద్రానికి సూచించారు.

కేంద్ర మంత్రి ఆక్షేపణ
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు కే. కేశవరావు, సురేష్‌రెడ్డి రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రతి గింజనూ కొంటామన్న మాటను మోదీసర్కార్ నిలబెట్టుకోవాలన్నారు. గ‌తేడాది త‌ర‌హాలోనే 94 ల‌క్షల మెట్రిక్ ట‌న్నులు సేక‌రించాలని డిమాండ్‌ చేశారు. దీనికి బదులిచ్చిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌.. గ‌తంలో ఇచ్చిన టార్గెట్‌నే తెలంగాణ ఇంకా పూర్తిచేయలేదన్నారు. ఇచ్చిన టార్గెట్‌లో 29 ల‌క్షల మెట్రిక్ ట‌న్నులు ఇంకా పెండింగ్‌లో ఉందని తెలిపారు. ధాన్యం సేకరణ విషయంలో అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు.

తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకే ధాన్యం సేకరణ జరుగుతోందని రాజ్యసభలో స్పష్టంచేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌. ఆయా రాష్ట్రాలు తినే బియ్యాన్నే తాము కొనుగోలు చేస్తామని తేల్చిచెప్పారు. టీఆర్‌ఎస్ ఎంపీ సురేష్‌రెడ్డి లేవెనత్తిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు కేంద్రమంత్రి. భవిష్యత్‌లో పారా బాయిల్డ్ రైస్‌ పంపిణీ చేయబోమని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందన్నారు. మళ్లీ ఇప్పుడీ అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయం చేస్తోందని విమర్శించారు.

Time 12:00 PM
డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ జయంతిని పురస్కరించుకుని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పలువురు ఎంపీలు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఆయనకు నివాళులు అర్పించారు.

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలంటూ వరుసగా నాలుగోరోజూ లోక్‌సభలో ఆందోళన కొనసాగించారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు. వెల్‌లోకి దూసుకెళ్లి ఫ్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ రైతులకు న్యాయం చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై జాతీయ విధానాన్ని ప్రక‌టించాల‌ని డిమాండ్ చేశారు.

పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద అధికార విపక్షాల పోటాపోటీ నిరసనలపై లోక్‌సభలో దుమారం రేగింది. విపక్షాలు ఆందోళన చేస్తున్న గాంధీ విగ్రహం వద్దకు బీజేపీ సభ్యులు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్‌ చౌధురి. స్పీకర్ ఓంబిర్లా దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ట్రెజరీ బెంచ్‌ దీటుగా స్పందించింది. గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టే హక్కు అధికారపక్షం ఎంపీలకు కూడా ఉందన్నారు కేంద్రమంత్రి అర్జున్‌సింగ్ మేఘ్వాల్.

Time 11:00 AM
పార్లమెంట్‌ ఐదో రోజు సమావేశాల్లో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ శుక్రవారం ప్రారంభమయ్యాయి.

12 సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని విపక్ష సభ్యులు పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద మరోసారి నిరసన చేపట్టారు. అయితే, వారికి కౌంటర్‌గా బీజేపీ సభ్యులు కూడా అదే ప్రాంతంలో నిరసనకు దిగారు.

లఖింపూర్‌ ఖేరీ ఘటనపై, కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్‌కుమార్‌ మిశ్రా తొలగింపు అంశంపై చర్చించాలని కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఐదో రోజు ఉభయ సభలు కొలువుదీరాయి. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సవరణ) బిల్లు 2021, ఢిల్లీలో ప్రత్యేక పోలీసు వ్యవస్థ ఏర్పాటు (సవరణ) బిల్లు 2021, జాతీయ ఫార్మాస్యూటికల్‌ విద్య మరియు పరిశోధన (సవరణ) బిల్లు 2021 నేడు లోక్‌సభ ముందుకు రానున్నాయి. ఇక 12 మంది సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ సభలో విపక్ష సభ్యుల నిరసనల మధ్యే డ్యామ్‌ సేఫ్టి బిల్లు 2019ను రాజ్యసభ గురువారం ఆమోదించింది.

>
మరిన్ని వార్తలు