Parliament Winter Sessions:పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు: ఉభయ సభలు వాయిదా.. కుదిపేసిన రైతుల అంశం

29 Nov, 2021 14:32 IST|Sakshi

Live Updates:

Time 2:20 PM
కుదిపేసిన రైతుల అంశం.. ఉభయ సభలు వాయిదా

Time 2:17 PM
సాగుచట్టాల బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం

Time 2:15 PM
వాయిదా తర్వాత ప్రారంభమైన రాజ్యసభ
సాగుచట్టాల రద్దు బిల్లుకు మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం.

Time 2:01 PM
వాయిదా అనంతరం లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది. సాగు చట్టాల బిల్లు పై చర్చ తప్పనిసరేనని కాంగ్రెస్‌ ఆందోళనకు దిగడంతో సభను స్పీకర్‌ రేపటికి వాయిదా వేశారు.

​​​​​
విపక్షాల ఆందోళన నడుమ కొనసాగని పార్లమెంట్‌ సమావేశాలు, మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉభయ సభలు వాయిదా.

ఎంఎస్‌పీ బిల్లు కోసం పోరాడుతాం: రైతు సంఘం నేత రాకేశ్‌ టికాయత్‌
►సాగుచట్టాల రద్దు బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినంత మాత్రన ఆందోళనలపై వెనక్కు తగ్గేది లేదని రైతు సంఘం నేత రాకేశ్‌ టికాయత్‌ తేల్చి చెప్పారు. డిసెంబర్‌ 4 జరిగే సమావేశం తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఎంఎస్‌పీ బిల్లు కోసం పోరాటం సాగుతుందన్నారు.


Time 12:28 PM
మధ్యాహ్నం రెండింటి వరకు రాజ్యసభ వాయిదా
రాజ్యసభలోనూ రద్దు బిల్లుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఎంఎస్‌పీకి చట్టబద్ధత, సాగుచట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో చనిపోయిన రైతులకు పరిహారం, తెలంగాణలో వరి కొనుగోళ్లపై     స్పష్టత సహా పలు అంశాలపై విపక్ష ఎంపీలు చర్చకు డిమాండ్ చేశాయి. ఛైర్మన్ వెంకయ్యనాయుడు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసనకు దిగాయి. క్వశ్చన్‌ అవర్‌లో గందరగోళం సృష్టిస్తున్న విపక్ష ఎంపీల తీరుపై ఛైర్మన్‌ వెంకయ్య సీరియస్ అయ్యారు. సభను 2 గంటలవరకూ వాయిదా వేశారు.

Time 12:24 PM
► వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ


Time 12:18 PM
►  మధ్యాహ్నం రెండింటి వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్‌ ఓం బిర్లా
►  వాయిదా అనంతరం కూడా విపక్షాల ఆందోళన కొనసాగడంతో రెండో సారి ప్రారంభమైన 5 నిమిషాల్లోనే లోక్‌సభ మళ్లీ వాయిదా.
► సాగుచట్టాల రద్దు బిల్లుకు మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదం.

Time 12:05 PM
► వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌సభ
►  లోక్‌సభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

ఉభయ సభలు గంట పాటు వాయిదా

Time 11:20 AM
►ఇటీవల మృతి చెందిన పలువురు సభ్యులకు రాజ్యసభలో నివాళులు. అనంతరం సిట్టింగ్‌ ఎంపీ ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ మృతికి సంతాపంగా రాజ్యసభను చైర్మన్‌ వెంకయ్య నాయుడు గంట వాయిదా వేశారు. 

Time 11:10 AM..విపక్షాల ఆందోళణ.. లోక్‌సభ గంట వాయిదా
►ప్రశ్నోత్తరాలను రద్దు చేయాలని విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో స్పీకర్‌ ఓంబిర్లా లోక్‌సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.

Time 11:03 AM..
► లోక్‌సభలో.. కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం ఇటీవల మరణించిన ప్రస్తుత, మాజీ ఎంపీలకు లోక్‌సభ సంతాపం తెలిపింది.

తర్వాత ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు స్పీకర్‌ ఓంబిర్లా ప్రయత్నించగా.. వివిధ అంశాలపై చర్చ చేపట్టాలంటూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. సాగుచట్టాల రద్దుపై చర్చించాలంటూ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు.

Time 11.00 AM
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Time 10.55 AM
►శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ పార్లమెంట్‌కు చేరుకున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఫలప్రదంగా సాగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కేంద్రం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందని... సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

Time 10.50 AM
►సాగు చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. గాంధీ విగ్రహం జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. రైతు సమస్యలపై చర్చించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. భంగం వాటిల్లకుండా చూసుకోవాలని ఎంపీలకు సూచించారు. 

►పెగసస్​ వ్యవహారం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, చైనా చొరబాట్లపై సభలో చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. బంగాల్ సహా పలు రాష్ట్రాల్లో సరిహద్దు భద్రతా దళం నియంత్రణ పరిధిని పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. వీటిపై పార్లమెంట్​లో వాడీవేడీ చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా  సాగు చట్టాల రద్దు బిల్లు కాకుండా మరో 25 ముసాయిదా చట్టాలను పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది కేంద్రం.

ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించే బిల్లుతో పాటు,  హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతన సవరణ బిల్లు 2021, దివాలా రెండో సవరణ బిల్లు,  పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్​మెంట్ అథారిటీ సవరణ బిల్లు, 1983 నాటి ఇమ్మిగ్రేషన్ చట్టం స్థానంలో 2021 ఇమ్మిగ్రేషన్ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు 2021,  మనుషుల అక్రమ రవాణా నిరోధక, రక్షణ, పునరావాస బిల్లులపై చర్చ జరుగనుంది. 

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వివాదాస్పద మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును కేంద్రం ప్రభుత్వం తొలిరోజే లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది. బిల్లును సభ ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ తమ సభ్యులకు విప్‌ జారీ చేశాయి. సోమవారం తప్పనిసరిగా సభకు హాజరుకావాలని ఆదేశించాయి. పంటలకు కనీస మద్దతు ధర(ఎస్పీజీ)కు చట్టబద్ధతతోపాటు రైతాంగం డిమాండ్లు, సమస్యలపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి.

మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా కొనసాగుతున్న పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారు. ఈ మేరకు ఒక సంతాప తీర్మానాన్ని పార్లమెంట్‌లో ఆమోదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 23 కొనసాగుతాయి. సెలవులు పోగా ఈసారి పార్లమెంట్‌లో మొత్తం 19 సెషన్స్‌ (పనిదినాలు) ఉంటాయి. 

క్రిప్టోకరెన్సీలపై నిషేధం 
పార్లమెంట్‌ సమావేశాల్లో సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుతోపాటు మరో 25 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. క్రిప్టోకరెన్సీలపై నిషేధం బిల్లు కూడా వీటిలో ఉంది. ఆర్‌బీఐ ఆధ్వర్యంలో అధికారిక డిజిటల్‌ కరెన్సీని మాత్రమే ప్రభుత్వం అనుమతించనుంది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు–2019పై జాయింట్‌ కమిటీ ఆఫ్‌ పార్లమెంట్‌(జేసీపీ) నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. పౌరుల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించడంతోపాటు డేటా ప్రొటెక్షన్‌ అథారిటీ ఏర్పాటు నిమిత్తం ఈ బిల్లును 2019లో ప్రభుత్వం తీసుకొచ్చింది.

ప్రతిపక్షాల సూచన మేరకు బిల్లును క్షుణ్నంగా పరిశీలించడానికి జేసీపీని ఏర్పాటు చేసింది. ప్రతిపాదిత డేటా ప్రొటెక్షన్‌ చట్టం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సీబీఐ తదితర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు మినహాయింపు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

కీలక బిల్లులివే..
గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ల స్థానంలో నార్కోటిక్స్‌ డ్రగ్, సైకోటిక్‌ సబ్‌స్టాన్సెస్‌ బిల్లు, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్‌ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌(సవరణ) బిల్లును ఈసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం పొడిగింపునకు సంబంధించిన బిల్లులు ఇందులో ఉన్నాయి. రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల జాబితా సవరణకు ఉద్దేశించిన ‘కానిస్టిట్యూషన్‌ (ఎస్సీలు, ఎస్టీలు) ఆర్డర్‌(సవరణ) బిల్లును సైతం ప్రవేశపెట్టనుంది.

పార్లమెంట్‌ పనితీరుపై సుప్రీం వ్యాఖ్యలు ఆందోళనకరం
పార్లమెంట్‌తోపాటు ఇతర చట్టసభల పనితీరు, చట్టాలను రూపొందిస్తున్న విధానం పట్ల ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభల హక్కులకు, మర్యాదలకు భంగం వాటిల్లకుండా, ఇతర రాజ్యాంగబద్ధ వ్యవస్థలు చట్టసభలపై ప్రతికూల వ్యాఖ్యలు చేయకుండా సభాపతులే(ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు) తగిన చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడి దృష్టికి తీసుకొచ్చారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వెంకయ్య ఆదివారం తన నివాసంలో దాదాపు 40 పార్టీల నేతలతో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై వారు వెలిబుచ్చిన అభిప్రాయాలను తెలుసుకున్నారు. ‘‘మీ ఆందోళనను అర్థం చేసుకోగలను.

ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందో గమనించాలి. చట్టసభల్లో తరచూ అంతరాయాలు కలుగుతున్నాయి. సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. చట్టసభల్లో మన ప్రవర్తన గౌరవంగా, హూందాగా ఉంటే ప్రజాబాహుళ్యం నుంచి ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు వినిపించవు’’ అని సూచించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో 70 శాతం సమయం వృథా అయ్యిందని, శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని పలువురు నేతలు వెల్లడించారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు తరచుగా కలిసి మాట్లాడుకుంటే, పార్లమెంట్‌లో గొడవలకు ఆస్కారం ఉండదని వెంకయ్యlనాయుడు తెలిపారు.    

‘ఎంఎస్పీ’పై చర్యలు తీసుకోవాలి
అఖిలపక్ష సమావేశంలో 15 అంశాలను లేవనెత్తాం. రైతుల సమస్యలను ప్రస్తావించాం. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని విన్నవించాం. విద్యుత్‌ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. ఎంఎస్పీకి చట్టబద్ధతపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పాం. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని విన్నవించాం.

ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపాం. పార్లమెంట్‌ 19 రోజులపాటే పనిచేయనుంది. అన్ని అంశాలపై చర్చించేందుకు సమయం సరిపోదు. లోక్‌సభ సక్రమంగా కొనసాగడానికి డిప్యూటీ స్పీకర్‌ను నియమించాలి. పార్లమెంట్‌లో మీడియాపై విధించిన ఆంక్షలను తొలగించాలి 
– మల్లికార్జున ఖర్గే, అధిర్‌ రంజన్‌ చౌదరి, కాంగ్రెస్‌ నేతలు 

మహిళా రిజర్వేషన్‌ బిల్లును చేపట్టాలి 
పార్లమెంట్‌ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును తీసుకురావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీలు అఖిలపక్ష సమావేశంలో కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. పార్లమెంట్‌లో ఈ బిల్లుపై చర్చించాలని కోరాయి. విధాన నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలకు వారి వంతు భాగస్వామ్యం కల్పించాల్సిన సమయం వచ్చిందని సూచించారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గత 15 ఏళ్లుగా మోక్షం లభించడం లేదు.

చదవండి: భారత్‌లో ఒమిక్రాన్‌ ప్రకంపనలు.. అప్రమత్తమైన రాష్ట్రాలు

మరిన్ని వార్తలు