29 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు!

9 Nov, 2021 02:32 IST|Sakshi

కేబినెట్‌ కమిటీ ప్రతిపాదన 

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను ఈ నెల 29 నుంచి డిసెంబర్‌ 23 దాకా నిర్వహించాలని పార్లమెంట్‌ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్‌ కమిటీ(సీసీపీఏ) ప్రతిపాదించినట్లు అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. గత ఏడాదిన్నరగా నిర్వహిస్తున్నట్లుగానే శీతాకాల సమావేశాలను కూడా కోవిడ్‌–19 నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నిర్వహించనున్నట్లు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో 20 సిట్టింగ్స్‌ ఉండే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. కరోనా మహమ్మారి ఉధృతి కారణంగా గత ఏడాది పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు.

బడ్జెట్, వర్షాకాల సమావేశాలను కుదించాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ద్రవ్యోల్బణం, చమురు ధరల పెరుగుదల, జమ్మూకశ్మీర్‌లో పౌరులపై ఉగ్రవాదుల దాడులు, లఖీంపూర్‌ ఖేరిలో హింస, కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం తదితర అంశాలపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు