ఫేస్‌బుక్‌కు పిలుపు

21 Aug, 2020 02:51 IST|Sakshi

2న స్టాండింగ్‌ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశం

న్యూఢిల్లీ: కొందరు బీజేపీ నాయకుల విద్వేషపూరిత పోస్టులను ఫేస్‌బుక్‌ చూసీచూడనట్లు వదిలేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో... సెప్టెంబర్‌ 2న తమముందు హాజరై వివరణ ఇవ్వాలని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఫేస్‌బుక్‌కు సమన్లు జారీచేసింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఫేస్‌బుక్‌ ప్రతినిధులతో చర్చించనుంది.

పౌరుల హక్కులకు రక్షణ కల్పించడం, అంతర్జాలంలో మహిళల భద్రత అంశాలపై కూడా చర్చించే ఈ సమావేశానికి ఫేస్‌బుక్‌ ప్రతినిధులతో పాటు ఐటీ మంత్రిత్వశాఖ అధికారులను కూడా పిలిచింది. అలాగే ఇంటర్నెట్‌ నిలిపివేతలపై సెప్టెంబర్‌ ఒకటో తేదీన స్టాండింగ్‌ కమిటీ సమాచార ప్రసారశాఖ అధికారులు, హోంశాఖ అధికారులతో భేటీ కానుంది. బిహార్, జమ్మూకశ్మీర్, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది. వచ్చేనెల ఒకటి, రెండో తేదీల్లో జరిగే ఐటీ స్టాండింగ్‌ కమిటీ సమావేశాల ఎజెండాను లోక్‌సభ సచివాలయం గురువారం ఒక నోటిఫికేషన్‌ ద్వారా విడుదల చేసింది.

థరూర్‌ను తొలగించాలి
ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీపై  పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ శశిథరూర్‌ను, ఆ పదవి నుంచి తప్పించాలని, అదే కమిటీకి చెందిన సభ్యుడు, బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకి రాసిన లేఖలో కోరారు. లోక్‌సభ నియమాలను అనుసరించి, ఆయన స్థానంలో మరో సభ్యుడిని చైర్మన్‌గా నియమించాలని కోరారు.

శశిథరూర్‌ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్‌ అయినప్పటినుంచీ, కమిటీ వ్యవహారాలను పద్ధతి ప్రకారం నిర్వహించడంలేదని, తన వ్యక్తిగత ఎజెండాని ముందుకు తీసుకెళుతూ, పుకార్లు వ్యాప్తిచేస్తూ, తమ  పార్టీపై బురదచల్లుతున్నారని దూబే ఆ లేఖలో పేర్కొన్నారు.  ఫేస్‌బుక్‌ ప్రతినిధులను స్టాండింగ్‌ కమిటీ ముందుకు పిలిచే విషయాన్ని కమిటీ సభ్యులకు చెప్పకుండా శశిథరూర్‌ మొదట మీడియాకు వెల్లడించారని, ఇది హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని దూబే  పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గత ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసినప్పటికీ, ఫేస్‌బుక్‌ అధికారులు చర్యలు చేపట్టలేదని శశిథరూర్‌ ఆరోపించారు.

మరిన్ని వార్తలు