రాజ్యసభలో రగడ

23 Jul, 2021 02:33 IST|Sakshi
రాజ్యసభలో ఆందోళనకు దిగిన విపక్ష సభ్యులు

పెగసస్‌పై వివరణ ఇచ్చేందుకు సిద్ధమైన ఐటీ మంత్రి

మంత్రి చేతిలోని పేపర్లు చింపేసిన తృణమూల్‌ ఎంపీ

న్యూఢిల్లీ: పెగసస్‌ ఫోన్ల హ్యాకింగ్‌ అంశం మరోసారి పార్లమెంట్‌ సభాకార్యక్రమాలను పట్టి కుదిపేసింది. దేశంలోని ప్రముఖ నాయకులు, సుప్రీంకోర్టు జడ్జి, కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారులు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయుల ఫోన్ల హ్యాకింగ్‌ ఉదంతంపై కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా సవివరణ ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వం తరఫున కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరణ ఇవ్వాల్సిందేనని తృణమూల్‌ కాంగ్రెస్, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభ వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. దీంతో ఈ అంశంపై రాజ్యసభలో వివరణ ఇచ్చేందుకు ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లేచి నిలబడి తన చేతుల్లోని పేపర్లను చదవడం మొదలుపెట్టారు.

కొన్ని వాక్యాలు చదవడం పూర్తయ్యేలోపే తృణమూల్‌ ఎంపీ శంతను సేన్‌.. మంత్రి వైష్ణవ్‌ చేతుల్లోని పేపర్లు లాక్కొని, చింపేసి, గాల్లోకి విసిరేశారు. దీంతో మంత్రి తన ప్రసంగాన్ని ఆపేయాల్సి వచ్చింది. డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ కలగజేసుకుని.. సభ్యులు సభలో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఆ తర్వాత తన వివరణ/నివేదికకు సంబంధించిన ప్రతిని ఒకదాన్ని డిప్యూటీ చైర్మన్‌కు మంత్రి అందజేశారు. వెల్‌లో ఆందోళనలు ఆగకపోవడంతో సభను వాయిదావేస్తున్నట్లు డెప్యూటీ చైర్మన్‌ ప్రకటించారు. పెగసస్‌ వివాదం మొదలయ్యాక 19వ తేదీన మంత్రి మీడియాతో మాట్లాడిన అంశాలే.. సభలో డిప్యూటీ చైర్మన్‌కు మంత్రి ఇచ్చిన నివేదికలో ఉన్నాయి. ‘ప్రముఖులపై నిఘా పెట్టారంటూ ది వైర్‌ వెబ్‌పోర్టల్‌ ద్వారా వెల్లడైన నివేదికలన్నీ అబద్ధాలు. భారత ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వ సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు సృష్టించినవి ’అని మంత్రి వివరణలో ఉంది.

మంత్రి హర్దీప్‌ దూషించారు: శంతను సేన్‌
‘సభలో మంత్రి వైష్ణవ్‌ చేతిలోని పేపర్లు చింపేసి నిరసన తెలిపాను. అదే సమయంలో అక్కడే ఉన్న మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ నన్ను బూతులు తిట్టారు. నాపై దాడికి సైతం ప్రయత్నించారు. తోటి ఎంపీలు నన్ను వెనక్కి లాగి కాపాడారు’అని తృణమూల్‌ ఎంపీ శంతను సేన్‌ మీడియాతో చెప్పారు.  మంత్రి వైష్ణవ్‌సహా పలువురి పట్ల సభామర్యాదలు ఉల్లంఘించి ప్రవర్తించిన విపక్ష సభ్యులపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఎంపీ శంతను సేన్‌పై సస్పెన్షన్‌ విధించాలని రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.
 

మరిన్ని వార్తలు