వీడియో: త్రిపురలో పార్లమెంటరీ బృందంపై దాడి.. ‘బీజేపీ గుండాల’ పనేనంటూ..

11 Mar, 2023 08:46 IST|Sakshi

త్రిపురలో ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై విచారణ చేపట్టేందుకు వెళ్లిన పార్లమెంటరీ బృందంపై దాడి జరిగింది. శుక్రవారం సాయంత్రం ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఎవరికీ ఏం కాలేదు. అయితే మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పార్లమెంటరీ బృందం తన షెడ్యూల్‌లో మార్పులు చేసుకుంది. అయితే.. ఇది బీజేపీ పనేనంటూ కాంగ్రెస్‌, సీపీఎంలు ఆరోపణలకు దిగాయి.

త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత..  ఎనిమిది జిల్లాల్లో హింస చెలరేగింది. మార్చి 2వ తేదీ నుంచి ఇప్పటిదాకా వెయ్యి దాడులు చోటు చేసుకోగా.. 200 మందికిపైగా గాయపడ్డారు. ఈ హింసలో ముగ్గురి ప్రాణాలు పోయాయి కూడా.  ఈ నేపథ్యంలో.. నలుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ సభ్యులతో కూడిన పార్లమెంటరీ బృందం ఒకటి ఆ హింసాత్మక ఘటనలపై విచారణ చేపట్టేందుకు త్రిపుర వెళ్లింది. మూడు బృందాలుగా విడిపోయి..  శుక్ర, శనివారాల్లో వెస్ట్‌ త్రిపుర, సెపహిజల, గోమతి జిల్లాల్లో పర్యటనకు సిద్ధం అయ్యాయి. అయితే.. 

శుక్రవారం సాయంత్రం బిసల్‌ఘడ్‌లోని నేహల్‌చంద్ర నగర్ బజార్‌లో పార్లమెంటరీ బృందం పర్యటించగా.. కొందరు నినాదాలు చేస్తూ వాళ్లను అడ్డుకునే యత్నం చేశారు. ఆ సమయంలో ఎంపీలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, కొందరు నేతలు కూడా అక్కడ ఉన్నారు. అయితే.. పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోవడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఎంపీల బృందాన్ని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. ఎవరికీ గాయలు కాలేదని, వాహనాలు మాత్రం ధ్వంసం అయ్యాయని పోలీసులు చెప్తున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు.. అలాగే మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది పోలీస్‌ శాఖ.   

ఇదిలా ఉంటే.. దాడి యత్నాన్ని కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేష్‌ ఖండించారు. బిలాస్‌ఘడ్‌తో పాటు మోహన్‌పూర్‌లోనూ కాంగ్రెస్‌ నేతల బృందంపై బీజేపీ గూండాలు దాడి చేశారని, పోలీసులు అక్కడే ఉండి కూడా ఏం చేయలేకపోయారని విమర్శించారాయన. అంతేకాదు ఈ ప్రాంతంలోనే బీజేపీ ఎన్నికల విక్టరీ ర్యాలీకి ప్లాన్‌ చేసిందని, కాబట్టి ఇది బీజేపీ ఆధ్వర్యంలోనే జరిగిన దాడి అంటూ ఆరోపించారాయన. మరోవైపు సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి జితేంద్ర చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. దాడి నేపథ్యంలో పార్లమెంటరీ బృందం తన కార్యక్రమాలను నిలిపివేసిందని, షెడ్యూల్‌లో మార్పు చేసుకుందని చెప్పారు.

మరిన్ని వార్తలు