షార్‌లో పాక్షిక లాక్‌డౌన్‌ 

22 Apr, 2021 04:09 IST|Sakshi
సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) కేంద్రం

షార్‌ కాలనీల్లో 600 కేసులున్నట్లు గుర్తింపు 

50 శాతం మందే విధుల్లోకి.. 

ప్రయోగాల లక్ష్యం ప్రశ్నార్థకం  

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు గుండెకాయ వంటి సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో పాక్షికంగా లాక్‌డౌన్‌ విధించారు. 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. షార్‌ కేంద్రంలోని ఉద్యోగుల్లో కోవిడ్‌ ప్రబలుతుండడంతో షార్‌ డైరెక్టర్, కంట్రోలర్, ఇతర అధికారులంతా కలిసి ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కే శివన్‌కు పరిస్థితులను వివరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. షార్‌ కేంద్రానికి సంబంధించి సూళ్లూరుపేట పట్టణంలో పులికాట్‌ నగర్‌ (కేఆర్‌పీ కాలనీ) స్వర్ణముఖినగర్‌ (డీఓఎస్‌ కాలనీ), పినాకినీ నగర్‌ (డీఆర్‌డీఎల్‌ కాలనీ)ల్లో కోవిడ్‌ విజృంభిస్తుండడంతో టెస్ట్‌లు చేస్తున్నారు.  ఈ మూడు కాలనీల్లో  600 కరోనా పాజిటివ్‌ కేసులున్నట్లు గుర్తించారని సమాచారం. కరోనా నేపథ్యంలో 50% మందే బుధవారం నుంచి విధుల్లోకి వెళ్లే విధంగా నిర్ణయం తీసుకున్నారు. షార్‌ కేంద్రంలో 2 వేల మంది రెగ్యులర్, మరో 2 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు.  

ప్రయోగాలకు బ్రేక్‌ ?  
కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది రాకెట్‌ ప్రయోగాలకు బ్రేక్‌ పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.    ఈ నెలాఖరుకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌ 10 ప్రయోగాన్ని చేయాలని అనుకున్నారు. అది కూడా ఈ నెలాఖరులో నిర్వహిస్తారా! లేదా అనే విషయం కూడా ప్రకటించలేకపోతున్నారు. గతేడాది ఇదే సమయంలోనే కరోనా పరిస్థితుల కారణంగా ప్రయోగాలకు బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోవిడ్‌ నిబంధనల మేరకు రెండు ప్రయోగాలు చేశారు.  ఈ విషయంపై షార్‌ అధికారిని సంప్రదించగా.. ప్రయోగాలకు ఎలాంటి ఆటంకం ఉండదని, ఆలస్యం అయ్యే అవకాశం మాత్రం ఉండొచ్చునని చెప్పారు.    

మరిన్ని వార్తలు