ఆ ఉద్యోగాలు కేవలం పురుషులకే అన్న అభిప్రాయానికి కాలం చెల్లింది: మోదీ

25 Oct, 2021 05:37 IST|Sakshi

బాలికలకు వారు స్ఫూర్తి ప్రదాతలు 

కొత్త తరం పోలీస్‌ వ్యవస్థను నడిపించేది మహిళలే

‘మన్‌ కీ బాత్‌’లో ప్రధానమంత్రి మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: పోలీసు శాఖలో మహిళల సంఖ్య పెరుగుతుండడం శుభ పరిణామమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో 2014 నుంచి 2020 మధ్య మహిళా పోలీసుల సంఖ్య రెట్టింపయ్యిందని అన్నారు. భవిష్యత్తులో కొత్త తరం పోలీస్‌ వ్యవస్థను వారే ముందుండి నడిపిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మోదీ ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సైన్యం, పోలీసు శాఖ కేవలం పురుషులకే అన్న పాతకాలపు అభిప్రాయానికి కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు.

2014లో దేశవ్యాప్తంగా 1.05 లక్షల మంది మహిళా పోలీసులు ఉండగా, 2020 నాటికి 2.15 లక్షలకు చేరినట్లు ‘బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ గణాంకాలు వెల్లడిస్తున్నాయని గుర్తుచేశారు. గత ఏడేళ్లలో సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు దళాల్లోనూ మహిళల సంఖ్య రెండింతలు పెరిగిందన్నారు. కఠినమైన శిక్షణ పొంది కోబ్రా బెటాలియన్, సీఆర్‌పీఎఫ్‌ యూనిట్లలో సైతం పనిచేసేందుకు యువతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారని ప్రశంసించారు.

ఇది మన సమాజంపై సానుకూల ప్రభావం చూపుతోందన్నారు. మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారని వివరించారు. మహిళా పోలీసులు బాలికలకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు.  

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడొద్దు
100 కోట్ల డోసుల కరోనా టీకా పంపిణీ పూర్తి కావడంతో దేశం కొత్త ఉత్సాహం, వేగంతో ముందుకు దూసుకెళుతోందని మోదీ అన్నారు. మనదేశం ఎప్పుడూ విశ్వశాంతి కోసం పాటుపాడుతూనే ఉందని తెలిపారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడొద్దని ప్రధాని ప్రజలను కోరారు.

మరిన్ని వార్తలు