Custard apple: సిరులు కురిపిస్తున్న సీతాఫలం.. నరాల బలహీనతతో బాధపడే వారు ఈ పండ్లను తింటే..

31 Aug, 2022 13:21 IST|Sakshi

సాక్షి, పార్వతీపురం జిల్లా: సీతాఫలాల సాగుకు పార్వతీపురం మన్యం జిల్లా పెట్టిందిపేరు. ఇక్కడి కొండ ప్రాంతాల్లో వంద శాతం సేంద్రియ పద్ధతిలోనే గిరిజనులు సీతాఫలాల తోటలను సాగుచేస్తున్నారు. వీటి నుంచి వచ్చే దిగుబడులు నాణ్యమైనవి కావడం, రుచిగా ఉండడంతో కొనుగోలుకు అధికమంది ఆసక్తిచూపుతున్నారు. అందుకే మన్యం సీతాఫలాలకు మార్కెట్‌లో గిరాకీ ఉంది. ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు వచ్చి ఇక్కడి పంటను కొనుగోలు చేస్తున్నారు.

రాష్ట్రంలో పార్వతీపురంమన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీలో సీతాఫలం పంట సాగవుతోంది. ఏటా వర్షాకాలంలో ఆరంభమై శీతాకాలం ముగిసేవరకు సీతాఫలం సీజన్‌ కొనసాగుతుంది. ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలోనే పంట చేతికి రావడంతో గిరిజనరైతులు సంబరపడుతున్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని చెబుతున్నారు.  

నాణ్యమైన దిగుబడులు...  
దశాబ్దాల కాలంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట, సాలూరు, మక్కువ, జి.ఎల్‌.పురం, జియ్యమ్మవలస, కురుపాం, పాచిపెంటలోని కొండ ప్రాంతంలో సుమారు 5 వేల ఎకరాల్లో  సీతాఫలం పంట సాగువుతోంది. శతశాతం సేంద్రియ పద్ధతిలోనే పంట సాగుచేస్తున్నారు. ఎటువంటి ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండానే వాతావరణ ప్రభావంతో పంట పక్వానికి వస్తుంది. అందుకే రుచిగా ఉంటాయి.  

ఏటా వంద కోట్ల వ్యాపారం... 
మన్యంలో ఏటా వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 8 టన్నుల దిగుబడి వస్తుందన్నది గిరిజన రైతుల లెక్క. కిలో రూ.15 నుంచి రూ.25లకు గిరిజనుల వద్ద వ్యాపారాలు కొనుగోలు చేసి గ్రేడ్‌లుగా విభజిస్తారు. తర్వాత సాధారణ రకాన్ని మార్కెట్‌లో రూ.40 నుంచి రూ.50కు, గ్రేడ్‌–1 రకం రూ.70 నుంచి రూ.80లకు  అమ్ముతున్నారు. ఏటా సుమారు రూ.100 కోట్ల వరకు సీతాఫలం వ్యాపారం సాగుతున్నట్టు అంచనా. రైతుల కంటే వ్యాపారులకే అధిక ఆదాయం సమకూరుతోంది. 
చదవండి: Health: ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో ఒక్కటే కాదు గుమ్మడి, గోధుమ గడ్డి..

సీతాఫలంతో ప్రయోజనాలెన్నో..  
►సీతాఫలాల్లో మానవ శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్‌ ఏ,బి–6, సీ, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, ఐరన్‌లు ఉంటాయి. కండరాల వృద్ధికి దోహదపడతాయి. నరాల బలహీనతతో బాధపడే వారు ఈ పండ్లను తినడం మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు.  

► సీతాఫలాన్ని, తేనెను తగినమోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన బరువు సొంతమవుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలకు శక్తిని ఇస్తుంది. 

► బరువు తగ్గాలి అనుకునేవారికి సీతాఫలం చక్కని ఔషధం. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపి, ఊబకాయం, అధిక బరువు సమస్యలకు చెక్‌ పెడుతుంది. కడుపులో ఉండే బిడ్డకు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. శిశువు మెదడు, నాడీ వ్యవస్థ మెరుగవుతుంది. తల్లిలో పాలవృద్ధికి దోహదపడుతుంది.  

►మలబద్దకంతో బాధపడేవారు సీతాఫలాలు తినడం మంచిది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. సీతాఫలం జ్యూస్‌గా లేదా నేరుగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అల్సర్, గ్యాస్, ఎసిడిటీ వంటి ఉదర సమస్యలను నివారిస్తుంది. 

ఆరోగ్యానికి మంచిది  
సీతాఫలంలో విటమిన్‌–ఎ అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల సహజంగా మీ చర్మం కాంతివంతమవుతుంది. విటమిన్‌–ఎ మీ దృష్టి లోపాలను కూడా సవరించి చురుకైన కంటిచూపును ఇస్తుంది. రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. రక్తశుద్ధికి తోడ్పడుతుంది.  
– డాక్టర్‌ జి.ప్రదీప్‌కుమార్, మెడికల్‌ ఆఫీసర్, వీరఘట్టం

మార్కెట్‌ సదుపాయం కల్పిస్తా..  
మన్యం జిల్లాలో పండే సీతాఫలాలకు మార్కెట్‌లో చాలా  డిమాండ్‌ ఉంది. అయితే, గిరిజనులకు ఆ ధరలు దక్కడం లేదు. వ్యాపారులు చౌకగా పంటను కొనుగోలు చేసి మైదాన ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సీతాఫలాలకు జీసీసీ ద్వారా మార్కెట్‌ సదుపాయం కల్పించేందుకు కృషిచేస్తా.  
– విశ్వసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ 

ఎగుమతి చేసేందుకు చర్యలు  
మన్యం సీతాఫలాలు భలే రుచిగా ఉంటాయి. ఇటువంటి ఫలాలు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. మార్కెట్‌ సదుపాయం కోసం సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వంతో మాట్లాడి సీతాఫలంకు మార్కెట్‌ సదుపాం కల్పిస్తాం. 
– బి.నవ్య, సీతంపేట ఐటీడీఏ పీఓ      

మరిన్ని వార్తలు