ఇక ఆ వాహనాలకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి

8 Mar, 2021 20:14 IST|Sakshi

న్యూఢిల్లీ: అన్ని కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలలో ఫ్రంట్ ప్యాసింజర్ కు ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 5న ఈ ఉత్తర్వులను కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. “వాహనం ముందు సీటులో డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణీకులకు ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి చేస్తూ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఒక ముఖ్యమైన రక్షణ చర్యగా పేర్కొంది. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ సూచనల ఆధారంగా ఈ నిబంధనలు తీసుకురావడం జరిగినట్లు" కేంద్రం పేర్కొంది. 

2021 ఏప్రిల్ 1న నుంచి కొనుగోలు చేసే ప్రతి కొత్త వాహనంలో ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. ఇక ఇప్పటికే కొన్న వాహనాలకు ఆ వాహనదారులు ఆగస్టు 31లోపు తప్పనిసరిగా ఎయిర్ బ్యాగ్స్ అమర్చుకోవాల్సి ఉంటుంది. గతంలో డిసెంబర్ 29, 2020న ఈ నిబంధనలు తీసుకొచ్చిన ప్రభుత్వం ప్రతి వాహనంలోనూ ముందు సీట్ల కోసం డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది. కొత్త వాహనాలకు ఏప్రిల్ 1, పాత వాహనాలకు జూన్ 1లోపు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం నిర్ణయించింది. డ్రైవర్ సీట్ లో ఎయిర్ బ్యాగ్ తప్పనిసరిగా ఉండాలని 2019 నుంచే నిబంధన ఉండగా.. ప్రస్తుతం డ్రైవర్ పక్క సీటుకు కూడా దీన్ని కొనసాగించారు. ఈ నిబంధన అన్ని ఎం1 కేటగిరి వాహనాలకు వర్తిస్తుంది. ఎనిమిది సీట్ల కంటే తక్కువ సైజున్న ప్యాసెంజర్ వెహికిల్స్ అన్నీ ఈ కేటగిరిలోకి చేరతాయి.

ఇటీవలి ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచంలోని రోడ్ ప్రమాద బాధితుల్లో 10 శాతం మంది భారతదేశం నుంచి ఉన్నారు. డ్రైవర్ పక్క సీటుకు కూడా ఎయిర్‌బ్యాగ్ ఉండటం వల్ల ప్రమాదం వల్ల కలిగే తీవ్రతను కొంచెం తగ్గించవచ్చు. దీనివల్ల డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణీకులకు అదనపు రక్షణ లభిస్తుంది. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా నాలుగు చక్రాల వాహన ధరలు రూ.5,000 నుంచి 8,000 పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్ వ్యక్తి ప్రాణాలను కాపాడే ఆస్కారం ఎక్కువ కాబట్టి ఇది అంత పెద్ద ధర కాకపోవచ్చు.

చదవండి:

ఆరు నెలలు నీటి అడుగున ఐఫోన్‌ 11, అయినా కూడా..

రెండు సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌!

మరిన్ని వార్తలు