షాకింగ్.. కదులుతున్న రైలు నుంచి యువకుడ్ని కిందకు తోసేసిన ప్యాసెంజర్‌

18 Oct, 2022 15:03 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడ్ని తోటి ప్యాసెంజర్ కదులుతున్న రైలులోనుంచి కిందకు తోసేశాడు. ఇద్దరు గొడవపడిన అనంతరం ఆగ్రహంతో ఈ పని చేశాడు. అయితే యువకుడు రైలు నుంచి కిందపడిపోయినా అతడ్ని తోసేసిన వ్యక్తి ఏమాత్రం పశ్చాతాపం, ఆందోళన లేకుండా యథావిధిగా వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. హౌరా-మాల్డా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధిత యువకుడ్ని సజల్ షేక్‌గా గుర్తించారు.

ఘటన అనంతరం ట్రాక్‌ పక్కన గాయాలతో స్పృహ కోల్పోయి పడి ఉన్న సజల్ షేక్‌ను గవర్నమెంట్ రైల్వే పోలీసులు చూసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒక్కరిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే యువకుడు తోటి ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించాడని, సీటుపై కాలు పెట్టినట్లు తెలుస్తోంది. మహిళలతో దురుసుగా మాట్లాడాడని ఆ కంపార్ట్‌మెంట్‌లోని తోటి ప్రయాణికులు కొందరు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు షేక్‌ తమను బెదిరించాడని కూడా వారు ఆరోపించారని చెప్పారు.

బాధిత యువకుడి స్టేట్‌మెంట్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. కాంపార్ట్‌మెంట్‌లో ఓ గుంపు గట్టిగా మాట్లాడుతూ, అరుస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టిందని, పక్కన ఫ్యామిలీలు ఉన్నా పట్టించుకోకుండా అలాగే ప్రవర్తించారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే వాళ్లతో తాను గొడవపడినట్లు చెప్పాడు. ఓ ప్రయాణికుడ్ని బెదిరించేందుకు తన వద్ద ఉన్న బ్లేడు తీసినట్లు ఒప్పుకున్నాడు. అయితే గొడవ జరిగినప్పుడు అవతలి వ్యక్తి తనను రైలు నుంచి కిందకు తోసేస్తాడని ఊహించలేదని, క్షణాల్లోనే అంతా జరిగిపోయిందని చెప్పాడు. కిందపడ్డాక షాక్‌లో తాను స్పృహ కోల్పోయానని పేర్కొన్నాడు.
చదవండి: కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్‌.. ఏడుగురు దుర్మరణం

మరిన్ని వార్తలు