ఢిల్లీ: తాగిన మైకంలో మూత్రం పోసిన స్టూడెంట్‌.. ఆపై క్షమాపణలు! అయినా అరెస్ట్‌

5 Mar, 2023 10:00 IST|Sakshi

న్యూఢిల్లీ: మరో పీ గేట్‌ ఘటన వెలుగు చూసింది. న్యూయార్క్‌-న్యూఢిల్లీ అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది.  తప్పతాగిన స్థితిలో ఓ భారతీయ విద్యార్థి మూత్రవిసర్జన చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణికుడు ఎలాంటి ఫిర్యాదు చేయకున్నా.. విమానయాన సంస్థ రంగంలోకి దిగి ఆ విద్యార్థిని అరెస్ట్‌ చేయించింది.

శుక్రవారం రాత్రి అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఏఏ292 న్యూయార్క్‌ నుంచి బయలుదేరింది. శనివారం రాత్రి ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యింది.  అయితే.. ఈ మధ్యలో ఓ ప్రయాణికుడు తప్పతాగిన మైకంలో మూత్ర విసర్జన చేశాడు. అది కాస్త పక్కనే ఉన్న ప్యాసింజర్‌కు తాకింది. దీంతో విమాన సిబ్బందికి విషయం తెలియజేశాడు సదరు ప్రయాణికుడు. అయితే.. మూత్ర విసర్జన చేసింది విద్యార్థి కావడం, ఫిర్యాదు చేస్తే అతని కెరీర్‌ దెబ్బ తింటుందనే ఉద్దేశం, పైగా క్షమాపణలు చెప్పడంతో.. ఈ ఘటనపై బాధితుడు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. 

కానీ, విమానయాన సంస్థ మాత్రం ఈ ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సిబ్బంది వెంటనే విషయాన్ని పైలట్‌కు తెలియజేశారు. పైలట్‌, ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం అందించారు. దీంతో.. ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అలర్ట్‌ అయ్యారు. విమానం ల్యాండ్‌ కాగానే సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. 

పౌర విమానయాన నిబంధనల ప్రకారం.. ప్రయాణికుడు విమానంలో అనుచితంగా ప్రవర్తించినట్లు రుజువైతే.. క్రిమినల్‌ చట్టాల ప్రకారం శిక్షలతో పాటు కొంతకాలం అతనిపై విమానయాన వేటు విధించే అవకాశం ఉంటుంది. 

గత నవంబర్‌లో ఇదే తరహాలో ఎయిర్‌ ఇండియా విమానంలో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. శంకర్‌ మిశ్రా అనే వ్యక్తి తాగిన మైకంలో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసి జైలుకు వెళ్లి.. బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్‌ఇండియా స్పందన సరైన రీతిలో లేదన్న అభియోగాలతో.. విమానయాన సంస్థకు 30 లక్షల రూ. జరిమానా కూడా విధించింది డీసీసీఏ.   

మరిన్ని వార్తలు