వామ్మో.. కరోనా ఎఫెక్ట్‌.. మేం జర్నీచేయం!

7 Apr, 2021 20:16 IST|Sakshi

కోవిడ్‌ ఎఫెక్ట్‌తో ప్రయాణాలు తగ్గుముఖం 

రైళ్లలో భారీగా తగ్గిన రద్దీ

చెన్నై, బెంగళూరు,కేరళ వైపు బుకింగ్‌లు అంతంతే.. 

పర్యాటకులు, సాధారణ ప్రయాణికులు వెనుకంజ 

సాక్షి, సిటీబ్యూరో: వేసవి వచ్చిందంటే చాలు రైళ్లు కిటకిటలాడుతాయి. ప్రయాణికుల రాకపోకలు రెట్టింపవుతాయి. రైల్వేస్టేషన్‌లలో సందడి నెలకొంటుంది. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. గతేడాది వేసవిలో కోవిడ్‌ ఉధృతి దృష్ట్యా రైల్వే సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈసారి వేసవిలో అన్ని రూట్లలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినప్పటికీ రెండో దశ కోవిడ్‌ విజృంభణతో ప్రయాణాలు  తగ్గుముఖం పట్టాయి. గత 15 రోజులుగా హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య తగ్గినట్లు రైల్వే వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సుమారు 25 శాతానికి పైగా ప్రయాణికుల రద్దీ తగ్గినట్లు అంచనా. నెల రోజుల క్రితం వరకు సికింద్రాబాద్‌ నుంచి ప్రతి రోజు లక్ష మందికి పైగా రాకపోకలు సాగించగా ఇప్పుడు 60 వేల నుంచి 70 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు  వేసవిలో ఏసీ  బోగీలకు ఉండే డిమాండ్‌ కూడా తగ్గింది. కోవిడ్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని చాలా మంది ప్రయాణికులు స్లీపర్‌ కోచ్‌లను ఎంపిక చేసుకోవడం  గమనార్హం.  
రైళ్లన్నింటినీ పునరుద్ధరించాక ఇలా... 
ఈ ఏడాది సంక్రాంతి నుంచి రైళ్ల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేశారు. గత సంవత్సరం కోవిడ్‌ దృష్ట్యా లాక్‌డౌన్‌ నిబంధనల అనంతరం మొదట 22 రైళ్లను అందుబాటులోకి తెచ్చిన దక్షిణమధ్య రైల్వే అధికారులు ఆ తరువాత ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లను పెంచారు.  
 అన్ని రైళ్లను ‘ప్రత్యేకం’ పేరిట  నడుపుతున్నారు. సాధారణ చార్జీలను  ‘తత్కాల్‌’కు  పెంచేశారు. సంక్రాంతి నాటికి సుమారు 75 రైళ్లు అందుబాటులోకి రాగా  ప్రస్తుతం వాటి సంఖ్య వంద దాటింది.  
 సికింద్రాబాద్‌ నుంచి న్యూఢిల్లీ, ముంబయి, పట్నా, దానాపూర్, అహ్మదాపూర్, రెక్సాల్, లక్నో, కోల్‌కత్తా, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖ, తిరుపతి, కడప, తదితర అన్ని రూట్లలో రైళ్ల రాకపోకలు పెరిగాయి.  
 ఈ ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 22 రైళ్లను కొత్తగా పునరుద్ధరించారు. మొదట్లో కేవలం 25 వేల మంది ప్రయాణం చేశారు. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. సంక్రాంతి నాటికి అన్ని రైళ్లలో  వెయిటింగ్‌ లిస్టు భారీగా నమోదైంది. కొన్నింటిలో ఏకంగా 250 నుంచి  300కు చేరుకుంది. వీకెండ్స్‌లో 1.10 లక్షల మంది వరకు ప్రయాణం చేశారు. కానీ రెండో దశ  కోవిడ్‌  విజృంభణతో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. ‘ఇప్పటికే రిజర్వ్‌ చేసుకున్నవాళ్లు  తమ ప్రయాణాలను యథావిధిగా కొనసాగిస్తున్నప్పటికీ కొత్తగా బుక్‌ చేసుకొనేవాళ్ల సంఖ్య మాత్రం తగ్గింది’ అని  రైల్వే  అధికారి ఒకరు చెప్పారు.  

పర్యాటకులు బంద్‌
సాధారణంగా వేసవి రోజుల్లో పర్యాటకుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరాన్ని సందర్శించేందుకు ఎక్కువ మంది వస్తారు. కానీ ఈసారి పర్యాటకులకు బదులు వలస కూలీల రాకపోకలు కొద్దోగొప్పో ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో సొంత ఊళ్లకు వెళ్లిన కూలీలు సడలింపు అనంతరం తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు.

దీంతో తరచుగా సొంత ఊళ్లకు వెళ్లి వచ్చే వాళ్ల  సంఖ్య పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గడమే కాకుండా నగరం నుంచి కేరళ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గింది.   

మరిన్ని వార్తలు