‘పఠాన్‌’ వివాదం: దీపిక ప్లేస్‌లో సీఎం యోగి ఫొటో మార్ఫింగ్.. కేసు నమోదు

19 Dec, 2022 15:42 IST|Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా పఠాన్‌ చిత్రంపై వివాదాలు రోజురోజుకీ తీవ్రతరమవుతున్నాయి. షారూక్‌ ఖాన్‌, దీపికా పదుకొనె జంటగా నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన బేషరం రంగ్‌ పాటపై పలువురు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నారు. ఈ పాటలోని పదాలు, హీరో హీరోయిన్‌ కాస్ట్యూమ్స్‌పై హిందూత్వ వాదులు, బీజేపీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

పఠాన్‌లోని బేషరం రంగ్‌ పాటలో షారూక్‌ ఖాన్‌, బికినిలో ఉన్న దీపికను హత్తుకొని ఉన్న ఓ పోస్టర్‌ ఉంది. అయితే  ఓ వ్యక్తి  దీపిక ముఖం వద్ద  ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఫోటోను మార్ఫింగ్‌ చేశాడు. ఈ ఫోటోను అజార్‌ ఆర్‌కే అనే ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూస్తుంటే అ‍చ్చం షారూక్‌ యోగి ఆదిత్యనాథ్‌ను పట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు అభ్యంతరం తెలుపుతూ.. సీఎం ఫోటోను ఈ విధంగా మార్ఫింగ్‌ చేయడం అవమానకరమని మండిపడుతున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

దీనిపై లక్నో సైబర్‌ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 295 ఏ, ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 66 కింద కేసు నమోదు చేశారు. దీపిక స్థానంలో సీఎం యోగి ఫోటోను మార్ఫింగ్‌ చేసిన వ్యక్తి ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు యూపీ పోలీసులు సోమవారం వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసును డీజీపీ హెడ్‌క్వార్టర్ సైబర్ టీమ్ విచారణ చేప్టింది,. ఇక ‘పఠాన్‌’ సినిమా జనవరి 25న థియేటర్లలోకి రానుంది.
చదవండి: మీ కూతురుతో క‌లిసి పఠాన్‌ సినిమా చూడండి: షారూక్‌కు మంత్రి సవాల్‌

మరిన్ని వార్తలు