‘వారు ఇక్కడకు వస్తే లైంగిక దాడులు పెరుగుతాయ్‌’

28 Oct, 2020 16:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లో భారతీయులు ఎవరైనా భూములు కొనుగోలు చేసేలా పలు చట్టాలను సవరించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే పీడీపీ నేత బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భూ చట్టాల్లో మార్పుల నేపథ్యంలో దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి భారతీయులు ఇక్కడ స్ధిరపడేందుకు వస్తే లైంగిక దాడులు పెరిగిపోతాయని పీడీపీ నేత, ఆ పార్టీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీకి సన్నిహితులు సురీందర్‌ చౌధరి వ్యాఖ్యానించడం కలకలం రేపింది.

జమ్ముకు ఘనమైన డోగ్రా సంస్కృతి వారసత్వం ఉందని, తాము దేశం కోసం విలువైన త్యాగాలు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. వారు (ఇతర ప్రాంతాల వారు) ఇక్కడికి రాగానే లైంగిక దాడుల వంటి నేరాలు అధికమవుతాయనే తాము చెప్పడం లేదని, తాము అస్సాం, మహారాష్ట్ర వాదననూ వినిపిస్తున్నామని..బయటి వారు ఇక్కడికి వస్తే తమ ఉద్యోగాలు పోతాయని చౌధరి పేర్కొన్నారు. ప్రస్తుతం జమ్ము ప్రాంతం ప్రశాంతంగా ఉందని, పలు గ్రామాల నుంచి మహిళలు చదువుకునేందుకు జమ్ముకు వచ్చారని చెప్పుకొచ్చారు.

ఫరీదాబాద్‌లో ఓ బాలికను కాల్చి చంపారు..హథ్రాస్‌లో ఏం జరిగిందో చూశామని వ్యాఖ్యానించారు. లైంగిక దాడుల కేసులు పెరుగుతున్నాయి...ఇవన్నీ జాతీయ మీడియాలో చూపుతున్నారని అన్నారు. కాగా, జమ్ము కశ్మీర్‌లో అభివృద్ధికి ద్వారాలు తెరిచేలా దేశంలో ఎవరైనా ఇక్కడ భూములు కొనుగోలు చేసేలా చట్ట సవరణలు చేపట్టడం స్వాగతించదగిన పరిణామమని బీజేపీ వ్యాఖ్యానించింది. చదవండి : ఇకపై కశ్మీర్‌లో భూములు కొనొచ్చు.. 

మరిన్ని వార్తలు