Pegasus: లీక్‌ డేటా బేస్‌లో కేంద్ర మంత్రులతో సహా జర్నలిస్టుల నెంబర్లు! దావా వేస్తామంటూ..

19 Jul, 2021 08:15 IST|Sakshi

ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండే స్పైవేర్‌ ‘పెగాసస్‌’ హ్యాకింగ్‌కు గురైందన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓవైపు భారత ప్రభుత్వం ఈ హ్యాకింగ్‌ కుంభకోణంలో తమ ప్రమేయం లేదని చెప్తుండగా.. మరోవైపు ఫోరెన్సిక్‌ టెస్టుల్లో పెగాసస్‌ ద్వారా డేటా హ్యాక్‌ అయ్యేందుకు వీలుందన్న కథనాలు కలకలం రేపుతున్నాయి. 

న్యూఢిల్లీ: దేశంలో మరో భారీ డేటా లీకేజీ కుంభకోణం ప్రకంపనలు మొదలయ్యాయా?. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, మరికొందరు ప్రముఖుల్ని లక్క్ష్యంగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌.. కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్పైవేర్‌ ద్వారా హ్యాకర్లు.. ప్రముఖుల ఫోన్‌ డేటాను చోరీ చేశారని ‘ది వైర్‌’ ఆదివారం ఓ కథనం ప్రచురించింది. 

తాజా కథనం ప్రకారం.. భారత్‌తో మరికొన్ని దేశాల ప్రముఖులను లక్క్ష్యంగా చేసుకుని ఈ హ్యాకింగ్‌ ఎటాక్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్‌ టెస్ట్‌లు(డేటాబేస్‌లో ఉన్న పది నెంబర్లపై పరీక్షలు) దాదాపుగా హ్యాకింగ్‌ జరిగిందనేందుకు ఆస్కారం ఉందని తేల్చాయని వైర్‌ ప్రస్తావించింది. మన దేశానికి చెందిన సుమారు 300 మంది ఫోన్‌ నెంబర్లు ఆ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు, తాజా-మాజీ అధికారులు, రాజ్యాంగబద్ధ పదవిలో ఓ ప్రముఖుడు, ముగ్గురు కీలక ప్రతిపక్ష సభ్యులు, 40 మంది జర్నలిస్టుల నెంబర్లు, ఆరెస్సెస్‌ సభ్యులు, ఇతర ప్రముఖుల వివరాలు ఉన్నట్లు, రాబోయే రోజుల్లో వాళ్ల పేర్లను సైతం వెల్లడిస్తామని ది వైర్‌ పేర్కొంది. యాపిల్‌ ఫోన్లు వాడే ప్రముఖుల డేటా మరింత తేలికగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని ఉటంకించింది.


దావా వేస్తాం
2018-19 నడుమ ఈ హ్యాకింగ్‌ ప్రయత్నం జరిగిందని, అయితే అన్ని నెంబర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయా,? లేదా? అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉందని వైర్‌ పేర్కొంది. వైర్‌తో పాటు వాషింగ్టన్‌ పోస్ట్‌ లాంటి అంతర్జాతీయ మ్యాగజైన్‌లు సైతం ఈ వార్తలను ప్రచురించాయి. మరోవైపు ఇజ్రాయెల్‌ కంపెనీ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ (పెగాసస్‌ను అమ్మేది ఇదే) ఆరోపణల్ని ఖండించింది. నిఘా కార్యకలాపాల కోసమే ఈ స్పైవేర్‌ను ఎన్‌ఎస్‌వో ప్రభుత్వాలకు అమ్ముతుంటుంది. అలాంటిది హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే ఉండదని స్పష్టం చేసింది. అయితే లీక్‌ డేటా బేస్‌లో నెంబర్లు కనిపించినంత మాత్రనా హ్యాక్‌ అయినట్లు కాదని గుర్తించాలని తెలిపింది. ప్రభుత్వాలకు మాత్రమే యాక్సెస్‌ ఉండే Pegasus డేటా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే లేదని, తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించింది.  

గతంలో కూడా..
పారిస్‌కు చెందిన ఓ మీడియా హౌజ్‌ ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం ద్వారా ఈ నిఘా కుంభకోణం వెలుగు చూసినట్లు సమాచారం. ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ రూపొందించిన పెగాసస్‌.. సైబర్‌వెపన్‌గా భావిస్తుంటారు. కానీ, ఐఫోన్‌ యూజర్లనే ఇది టార్గెట్‌ చేస్తుందని, హ్యాకింగ్‌కు పాల్పడుతుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఇది ఆండ్రాయిడ్‌ ఫోన్లను సైతం టార్గెట్‌ చేస్తుందని తర్వాత తేలింది. పెగాసస్‌ స్పైవేర్‌కు సంబంధించి ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ మీద ఫేస్‌బుక్‌ 2019లో ఓ దావా కూడా వేసింది. అంతేకాదు వాట్సాప్‌ యూజర్లను అప్రమత్తం చేసింది కూడా. ప్రస్తుతం పెగాసస్‌ కథనాలు పలు ఇంటర్నేషనల్‌ మీడియా హౌజ్‌లలో కూడా ప్రచురితం అవుతున్నాయి.

మరిన్ని వార్తలు