మూఢ నమ్మకాలు.. కరోనా వ్యాక్సిన్‌ వద్దు

6 Jan, 2021 13:53 IST|Sakshi

వ్యాధి ఏదైనా ప్రతీ టీకాకు తొలుత వ్యతిరేకతే..

ఇప్పుడు కోవిడ్‌ వ్యాక్సిన్‌ విషయంలోనూ అదే తీరు

 పాపులను శిక్షించేందుకే స్మాల్‌పాక్స్‌ అంటూమూఢ ప్రచారం  

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచంలో మహమ్మారి అనే పదానికి అర్థం చెప్పిన భయంకరమైన జబ్బు మశూచి.. కోట్లాది మందిని పొట్టనపెట్టుకున్న ఈ జబ్బుకు విరుగుడుగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలే జరిగాయి.. తట్టు, గవదబిళ్లల నిరోధానికి టీకా ఇస్తామని వస్తే ఊళ్లకు ఊళ్లే తలుపులకు తాళాలు వేసుకుని ఖాళీ చేశాయి. కోరింత దగ్గు, మీజిల్స్‌ టీకాలు బలవంతంగా వేయబోతే ఆత్మహత్య చేసుకుంటామని జనం బెదిరించారు. ఊళ్లకు ఊళ్లను శ్మశానవాటికలుగా మార్చిన మహమ్మారులకు విరుగుడుగా శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయాసలకోర్చి కష్టపడి తయారు చేసిన ప్రతి వ్యాక్సిన్‌పై తొలుత జనం నుంచి వ్యతిరేకతే ఎదురైంది. ఇప్పుడు కోవిడ్‌ టీకా విషయంలోనూ అదే జరుగుతోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్‌ టీకా వేసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని, శరీర డీఎన్‌ఏనే మారిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర వినియోగానికి టీకాలకు దేశాలు పచ్చజెండా ఊపుతున్నా.. జనంలో మాత్రం భయాందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 6 నెలల క్రితం.. కోవిడ్‌ అంటే ప్రాణాంతకంగా భావించి జనం బయటకు వచ్చేందుకే జంకిన సమయం. వెంటనే టీకా రావాలంటూ దేవుళ్లకు మొక్కుకున్నారు.. టీకాకు సంబంధించిన వార్తలు పత్రికల్లో వస్తే అక్షరం వదలకుండా చదివారు. కానీ.. సరిగ్గా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే వేళ.. అబ్బే మాకొద్దు అంటూ వెనకడుగు వేస్తున్నారు.

అప్పట్లో మూఢ నమ్మకాలు.. 
మహమ్మారులుగా పేర్కొనే భయంకర అంటువ్యాధులకు శతాబ్దాల చరిత్రే ఉంది. తొలుత వాటి నివారణకు వ్యాక్సిన్‌లు అందుబాటులో లేవు. 17వ శతాబ్దం చివరి నుంచే శాస్త్రవేత్తలు టీకాలను అందుబాటులోకి తేవడం ప్రారంభించారు. కానీ, టీకాలు అందుబాటులోకి వచ్చిన కొత్తలో మూఢనమ్మకాలు రాజ్యమేలాయి. వాటిని తీసుకునేందుకు జనం ముందుకు రాలేదు. మశూచికి ప్రతి సంవత్సరం దాదాపు 30 లక్షలకు పైగా ప్రపంచవ్యాప్తంగా బలయ్యే వారు. ఎట్టకేలకు 1796లో బ్రిటన్‌ వైద్యుడు ఎడ్వర్డ్‌ జెన్నర్‌ దానికి టీకా రూపొందించారు. ప్రపంచానికి పరిచయమైన తొలి వ్యాక్సిన్‌ అదే.. కానీ ప్రజలు దాన్ని వ్యతిరేకించారు. ‘ప్రపంచం పాపాలతో నిండిపోయింది. పాపులను శిక్షించేందుకు దేవుడు మశూచి వ్యాధిని వారి మీదకు వదిలాడు. దాన్ని అడ్డుకోవటం పాపం. పాపులు ఆ శిక్ష అనుభవించాల్సిందే.. టీకా తీసుకుని రోగం రాకుండా చేయడమంటే దేవుడి ఆజ్ఞను ధిక్కరించటమే..’అన్న మూఢనమ్మకం ప్రపంచవ్యాప్తంగా ప్రబలింది. అమెరికా నుంచి మన దేశం వరకు.. ఈ తీరు టీకాను వ్యతిరేకించేందుకు కారణమైంది.

ఇతరుల కణాలను ప్రవేశపెట్టడానికి వ్యతిరేకం
తొలినాళ్లలో మశూచి టీకా వేరే రకంగా ఉండేది. దాన్ని రూపొందించిన జెన్నర్‌ పరిశోధనలో.. కౌపాక్స్‌ వ్యాధి కారక వైరస్‌ సోకితే మశూచి వైరస్‌ దరిచేరదన్న విషయం తేలింది. అందుకే కౌపాక్స్‌ వ్యాధి కారక వైరస్‌తో రూపొందించిన టీకాను ఇవ్వటం ద్వారా మశూచి ప్రబలకుండా నిరోధించారు. కానీ, కౌపాక్స్‌ కారకాన్ని మరొకరి శరీరం నుంచి గ్రహించినందున దాన్ని తమ శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని ఎక్కువ మంది వ్యతిరేకించారు. అలా ఆ టీకా ప్రయోగం తొలినాళ్లలో విఫలమైంది.

పోలియో టీకాకూ.. 
మనిషిని జీవచ్ఛవంలా మార్చే పోలియో వ్యాధి ప్రబలకుండా వ్యాక్సిన్‌ వచ్చిన తొలినాళ్లలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆరోగ్యంగా ఉన్న వారి శరీరంలోకి వ్యాధికారక వైరస్‌ను ప్రవేశపెట్టడం ఏంటంటూ జనం తిరస్కరించారు. తమ శరీరంలోకి విషాన్ని ఎక్కిస్తున్నారంటూ ప్రదర్శనలు నిర్వహించారు. ఆరోగ్య కేంద్రాలపై దాడులు చేశారు. బ్రిటన్, అమెరికాలోనూ నిర సన ప్రదర్శనలు జరిగాయి. 

తప్పనిసరి చేసినా.. 
మశూచి మరణాలు తీవ్రం కావటంతో, తమ దేశం రూపొందించిన టీకాను అందరూ వేసుకోవాలంటూ బ్రిటిష్‌ పాలకులు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు. 1840లో ఈ చట్టం రూపొందించినప్పుడు చాలా దేశాలు బ్రిటిష్‌ రూల్‌లో ఉండేవి. అయినా చాలా దేశాల్లో జనం పట్టించుకోలేదు. ప్రతి ఒక్కరూ ఆ టీకా వేయించుకోవాల్సిందేనంటూ 1853లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఒక్క బ్రిటన్‌లో మాత్రం ప్రతి సంవత్సరం 66 శాతం మంది టీకా వేయించుకోవటం ప్రారంభించారు. ఇటు పేద దేశాల్లో చలనం రాలేదు. విద్యావంతులు తక్కువ సంఖ్యలో ఉండటమే దీనికి కారణం. ఇక మన దేశంలో అప్పటికి అక్షరాస్యత శాతం 40 శాతం లోపే.. దీంతో ఇక్కడ మూఢనమ్మకాల కారణంగా మశూచి మరణాలు తీవ్రంగా ఉండేవి. సగటున ప్రతియేటా దాదాపు 2 లక్షల మంది చనిపోయేవారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ జోక్యం.. 
ప్రతి టీకా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మశూచి టీకా విషయంలో 1967లో తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల స్థాయి నుంచే టీకాను వేయాలంటూ దేశాలను ఆదేశించింది. ఇది సత్ఫలితాలనిచ్చింది. ఎంఎంఆర్‌ వ్యాధుల విషయంలో కూడా అలాగే చేయాల్సి వచ్చింది. పిల్లల్లో మరణాలకు కారణమవుతున్న తట్టు, కోరింత దగ్గు, గవదబిళ్లలను నిరోధించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చింది. పోలియోను నిర్మూలించాలంటే ప్రతీ దేశం తోడ్పాటు అందించేలా సమావేశాలు నిర్వహించిన ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో వ్యాక్సినేషన్‌ చేయాల్సిందేనని ఒత్తిడి తెచ్చింది. దీంతోనే అన్ని దేశాలు పోలియో చుక్కలు వేయటాన్ని ఉద్యమంగా నిర్వహించి చివరకు 1982 నాటికి పోలియో రహిత ప్రపంచంగా మార్చగలిగాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు