‘ముసలోళ్లయితే చనిపోవాల్సిందే’: కరోనా మృతులపై మంత్రి వ్యాఖ్యలు

16 Apr, 2021 01:16 IST|Sakshi

భోపాల్‌: మహమ్మారి కరోనా వైరస్‌ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. అయితే పాలక ప్రభుత్వాలు మాత్రం దీన్ని తేలికగా తీసుకున్నట్టు కొన్ని సందర్భాలను చూస్తే తెలుస్తోంది. అయితే తాజాగా ఓ రాష్ట్ర మంత్రి కరోనా మరణాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ముసలోళ్లు అయితే చనిపోవాల్సిందే’ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి బాధ్యతరాహిత్యానికి నిదర్శనమని ప్రజలతో పాటు సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌ మంత్రి ప్రేమ్‌సింగ్‌ పటేల్‌ మీడియాతో మాట్లాడారు. ‘కరోనా నుంచి కాపాడాలని, రక్షించాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే రోజు కరోనా మరణాలు జరుగుతున్నాయని నేను అంగీకరిస్తా. ఈ మరణాలను ఎవరూ ఆపలేరు. వయసు మీద పడిన వారు చనిపోవాల్సిందే’ అంటూ ప్రేమ్‌సింగ్‌ పేర్కొన్నారు. తాము కూడా కరోనా కట్టడి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి అని అనంతరం సలహా ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో రోజుకు పది వేలకు చేరువగా పాజిటివ్‌ కేసులు, 50కి కరోనా మృతులు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలపై అక్కడి పార్టీలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు