టీకా రెండో డోస్‌పై దృష్టి పెట్టండి

20 Oct, 2021 08:28 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ లభ్యత సంతృప్తికరంగా ఉన్నందున, మొదటి డోస్‌ టీకా వేయించుకున్న వారంతా రెండో డోస్‌ తీసుకునేలా కృషి చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఈ ఏడాది జనవరి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా సాగుతున్న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో వేసిన డోసుల సంఖ్య 100 కోట్లకు చేరువవుతున్న సమయంలో ఈ మేరకు దిశానిర్దేశం చేసింది.

మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ‘కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకోని వారి సంఖ్య గణనీయంగా ఉన్నందున, వీరిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. చాలా రాష్ట్రాల్లో టీకా లభ్యత అవసరాలకు సరిపోను ఉండగా రెండో డోస్‌ కోసం లబ్ధిదారులు వేచి చూడాల్సిన పరిస్థితులు లేవు. ప్రభుత్వం కూడా అవసరమైన డోసులను అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో, వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను వేగవంతం చేసి, రాష్ట్రాలు తమ టీకా లక్ష్యాలను సులువుగా సాధించాలి’అని ఆయన పేర్కొన్నారు.

అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో ఏడాదిగా అమల్లో ఉన్న నిబంధనలపై తాజాగా సూచనలు చేయాల్సిందిగా రాష్ట్రాలను ఆయన కోరారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ మందకొడిగా సాగుతున్న జిల్లాలను గుర్తించడంతోపాటు అక్కడ ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. అందుకు అనుగుణంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, అదనంగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలన్నారు.  

చదవండి: వేలాదిగా కశ్మీర్‌ను వీడుతున్న వలసకూలీలు

మరిన్ని వార్తలు