భారత్‌లో కరోనా కొత్త వేరియంట్లు లేవు.. భయాందోళన వద్దు.. కానీ..!

10 Jan, 2023 20:59 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్లేమీ వెలుగు చూడలేదని కేంద్రం వెల్లడించింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇప్పటివరకు వెలుగు చూసిన వేరియంట్లు ప్రమాదకరం ఏమీ కాదని, రోగులు ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా రాలేదని స్పష్టం చేసింది. ఈమేరకు కోవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ ఎన్‌కే అరోరా తెలిపారు.

కరోనా వేరియంట్ల గురించి ఆందోళన లేనప్పటికీ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహిరిస్తోందని అరోరా స్పష్టం చేశారు. ఐరోపా, ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా దేశాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని వివరించారు. అందుకే ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లకు పంపిస్తున్నట్లు చెప్పారు.

భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసులు నమోదవుతన్నప్పటికీ, వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా లేదని కేంద్రం వివరించింది. అనేక నమూనాలను పరీక్షించినా కొత్త వేరియంట్‌లు కన్పించలేదని చెప్పింది. వచ్చే వారం కూడా కేసులు పెరిగే సూచనలు లేవని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందవద్దని, కానీ కరోనా జగ్రత్తలు పాటిస్తేనే మంచిదని సూచించింది.
చదవండి: ఆయిల్‌ పైప్‌ లైన్‌ను కట్ చేసిన దుండగులు.. పెట్రోల్ కోసం ఎగబడ్డ జనం

మరిన్ని వార్తలు