కరోనా వ్యాక్సిన్‌.. అతి పెద్ద సవాల్‌

7 Jan, 2021 13:23 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి, నిల్వ, పంపిణీ వీటన్నింటికి మించి మరో అతి పెద్ద సవాల్‌ కేంద్రం ఎదుర్కోబోతోంది. అదే టీకా తీసుకోవడంపై ప్రజల్లో నెలకొన్న సంశయం. రకరకాల కారణాలతో ఏకంగా 69% మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలా? వద్దా? అని తేల్చుకోలేకపోతున్నారని లోకల్‌సర్కిల్‌ సర్వే తేల్చి చెప్పింది. ఏదైనా వ్యాధికి వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధనలేవీ భారత్‌లో లేవు. అదే విధంగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకొని తీరాల్సిందేనంటూ కేంద్రం బలవంతంగా ఇవ్వలేదు. ప్రజలందరిలో అవగాహన పెంచి కరోనా టీకా ఇవ్వడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్‌.

డబ్ల్యూహెచ్‌ఓ ఏమందంటే..?
ఏదైనా వ్యాధిపై వ్యాక్సిన్‌ అభివృద్ధి చేశాక ప్రజలెవరూ తీసుకోవడానికి సుముఖంగా లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి కుంటు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎన్నో మొండి రోగాలను నివారించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోతే ఆరోగ్య ప్రపంచంవైపు అడుగులు వెయ్యలేమని అంటోంది. 2019లో వ్యాక్సిన్‌ పై ప్రజల్లో సంకోచం అనే అంశాన్ని ప్రపంచ ఆరోగ్య రంగం ఎదుర్కొంటున్న టాప్‌–10 సవాళ్లలో ఒకటిగా గుర్తించింది.
 
కొత్తేం కాదు  
భారతీయుల్లో టీకా పట్ల వ్యతిరేకత ఉండడం ఇప్పుడు కొత్తేం కాదు. ఎప్పట్నుంచో వారిలో టీకాలపై విముఖత నెలకొని ఉంది. 2000 సంవత్సరంలో యూపీలో నోట్లో వేసే పోలియో చుక్కల వల్ల ఫలదీకరణ సమస్యలు తలెత్తుతాయని ముస్లింలలో అపోహ ఉండేది. దీంతో ఈ టీకా ఎవరూ పిల్లలకి వేయించలేదు. అదే విధంగా కేరళలో డిఫ్తీరియా వ్యాక్సిన్‌ కూడా ముస్లింలెవరూ తీసుకోలేదు. మీజిల్స్‌ వంటి వ్యాక్సిన్లకు తమిళనాడు, కర్ణాటకలో కూడా ఆదరణ లభించలేదు. ఇప్పుడు సోషల్‌ మీడియా వచ్చాక వ్యాక్సిన్‌ సైడ్‌ అఫెక్ట్‌లపై ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉండడంతో ప్రజల్లో వ్యతిరేక భావాన్ని పెంచుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  

వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ఎందుకీ వెనుకంజ
కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ప్రజలు ముందు వెనుక ఆలోచించడానికి చాలా కారణాలున్నాయి. వ్యాక్సిన్‌పై నెలకొన్న అసంతృప్తి, అందుబాటులో లేకపోవడం, వ్యాక్సిన్‌పై విశ్వాసం లేకపోవడం వంటివన్నీ కారణాలేనని డబ్ల్యూహెచ్‌ఒ వెల్లడించింది. వ్యాక్సిన్‌ అంశంలో త్వరితగతిన పరిశోధనలు ముగించడం, ప్రయోగాలు పూర్తి కాకుండానే అత్యవసర అనుమతులు మంజూరు చేయడం, కరోనా వ్యాక్సిన్‌ సామర్థ్యం 70 శాతానికి మించి లేకపోవడం వంటివన్నీ కారణాలుగానే ఉన్నాయి. భారత్‌లో కరోనా మరణాలు 2శాతం కంటే తక్కువే ఉండడంతో ఎక్కువ మంది కరోనా వ్యాక్సిన్‌ తమకు అక్కర్లేదని భావిస్తున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ స్వయంగా చెప్పింది. ప్రజల్ని వ్యాక్సిన్‌ తీసుకోవడానికి సన్నద్ధుల్ని చేయడం తమ ముందున్న అతి పెద్ద సవాల్‌ అని అంగీకరించింది.

ఏ ఔషధానికైనా, వ్యాక్సిన్‌కైనా సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉంటాయి. కానీ పూర్తి స్థాయిలో ప్రమాదంలోకి నెట్టే టీకాలకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వవు. వ్యాక్సిన్‌ సురక్షితం, సామర్థ్యాన్ని పరీక్షించాకే ముందుకు వెళుతుంది. అందుకే ప్రజలందరూ టీకా పట్ల ఉన్న సందేహాలు విడిచిపెట్టి వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుకు రావాలి.
– డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్, వ్యాక్సిన్‌ శాస్త్రవేత్త 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు