కోవిడ్‌ టీకా తీసుకున్నవారికి రూ.5 వేల రివార్డు.. నిజమెంత?

13 Jul, 2022 15:00 IST|Sakshi

ఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తోంది కేంద్రం. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌, రాష్ట్రాన్ని బట్టి కొంత మేర చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశంలో 199.12 కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. ఇదిలా ఉంటే.. వాట్సాప్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 'కోవిడ్‌-19 టీకా తీసుకున్న వారికి ప్రభుత్వం రూ.5వేలు రివార్డ్‌ అందిస్తోంది' అంటూ ఓ సందేశం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది.

ఆ మెసేజ్‌ హిందీలో ఉంది. అది 'ముఖ్యమైన సమాచారం.. ఎవరైతే కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకుంటారో వారికి ప్రధానమంత్రి సంక్షేమ నిధి నుంచి రూ.5వేలు అందుతాయి. ఈ అవకాశం జులై 30 వరకే. ' అని ఉంది. మరోవైపు.. తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటూ ఓ లింక్‌ సైతం ఏర్పాటు చేశారు.

ఫేక్‌న్యూస్‌ను వ్యాప్తి చేయొద్దు.. 
కరోనా వ్యాక్సిన్‌పై వాట్సప్‌లో వైరల్‌గా మారిన నేపథ్యంలో అది ఫేక్‌న్యూస్‌గా పీఐబీ ఫాక్ట్‌ చెక్‌ ద్వారా స్పష్టం చేసింది ప్రభుత్వం. అలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయొద్దని సూచించింది.' ఈ మెసేజ్‌ను ఇతరులకు ఫార్వర్డ్‌ చేసే ముందు అది పూర్తిగా ఫేక్‌న్యూస్‌గా మీరు గుర్తుంచుకోవాలి. కరోనా టీకా తీసుకున్నవారికి రూ.5వేలు రివార్డ్‌ అందుతుందనే వార్త పూర్తిగా తప్పు.' అని పీఐబీ ఫాక్ట్‌ చెక్‌ తెలిపింది. అందులో ఉండే లింక్‌పైన ఎట్టిపరిస్థితుల్లో క్లిక్‌ చేయకూడదని, అలాంటి వాటితో సమస్యలు ఎదురవుతాయని పేర్కొంది.

ఇదీ చదవండి: మంత్రి మహిళను కొట్టాడని వీడియో షేర్ చేసిన బీజేపీ.. 48 గంటలు డెడ్‌లైన్‌

మరిన్ని వార్తలు