యూపీలో వర్షాలకు 10 మంది బలి

23 Sep, 2022 06:20 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్ల గోడలు కూలిన ఘటనలు, పిడుగుపాట్లతో 10 మంది చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. ఇటావా జిల్లా చంద్రపుర గ్రామంలో బుధవారం రాత్రి మూడు చోట్ల నివాసాల గోడలు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సహా ఏడుగురు మృత్యువాతపడగా మరో ముగ్గురు గాయపడ్డారు.

ఇటావాలో 24 గంటల వ్యవధిలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం తెలిపింది. ఫిరోజాబాద్‌లో ఇళ్ల గోడలు కూలిన ఘటనల్లో ఒక చిన్నారి సహా ఇద్దరు చనిపోగా మరో 8 మంది గాయపడ్డారు. బలరాంపూర్‌ జిల్లా బర్‌గద్వా సయీఫ్‌ గ్రామంలో పిడుగుపాటుకు గురై ఒక బాలుడు చనిపోగా మరొకరు గాయపడ్డారు. అలీగఢ్‌ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం వరకు అన్ని విద్యాసంస్థలను మూ­సివేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు