కృష్ణా జలాల పునఃపంపిణీ పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతి 

7 Oct, 2021 03:26 IST|Sakshi

షరతులు లేకుండా తెలంగాణను అనుమతించిన సుప్రీం 

కేంద్రానికి ఎలాంటి ఆదేశాలివ్వబోమని స్పష్టం చేసిన ధర్మాసనం 

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య సెక్షన్‌ –3 ప్రకారం కృష్ణా జలాల పునఃపంపిణీకి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలంటూ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. నూతన ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశం సందర్భంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సూచనల మేరకు పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంగీకరించడం తెలిసిందే. న్యాయస్థానం వెలుపల సమస్యను పరిష్కరించుకునేందుకు వీలుగా వీలైనంత త్వరగా నూతన ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని గతంలో కేసీఆర్‌ కోరారు.  

కేంద్రానికి ఎలాంటి ఆదేశాలూ ఇవ్వం 
కాగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు చాంబర్‌లో పలుసార్లు విచారణ జరిగినప్పటికీ షరతులు లేని ఉపసంహరణకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఎదుట బుధవారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. రిట్‌ పిటిషన్‌ ఉపసంహరణకు అంగీకరిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అయితే పిటిషన్‌లోని తమ అభ్యర్థనను పరిశీలించాలని తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాదులు సీఎస్‌ వైద్యనాధన్, వి.గిరి, ముకుల్‌ రోహత్గిలు ధర్మాసనాన్ని కోరగా మహారాష్ట్ర తరఫు సీనియర్‌ న్యాయవాది నార్‌గోల్కర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా ఆ పిటిషన్‌ ఉపసంహరణకు అభ్యంతరం లేదని ఏపీ తరఫు అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌ మెహ్‌ఫజ్‌ నజ్కీ నివేదించారు. దీంతో దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని ధర్మాసనం ప్రకటించింది. నదీ జలాల అంశం చాలా సున్నితమైనదని, ఇప్పటికే కృష్ణా జలాలపై మూడు అవార్డులు ఇవ్వగా నాలుగు రాష్ట్రాలు వేర్వేరు పిటిషన్లతో సుప్రీంకోర్టును ఆశ్రయించాయని ఏపీ తరఫు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే నివేదించారు.  

పరిశీలిస్తామని మాత్రమే చెప్పాం.. 
తమ అభ్యర్థన పిటిషన్‌లో స్పష్టంగా ఉందని, దీనిపై ధర్మాసనానిదే నిర్ణయమని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాధన్‌ తెలిపారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం మినిట్స్‌లో పొందుపరిచిన అంశాలను సీనియర్‌ న్యాయవాది వి.గిరి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రిట్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే నూతన ట్రిబ్యునల్‌ ఏర్పాటును పరిశీలిస్తామని మినిట్స్‌లో ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తాము కేవలం పరిశీలిస్తామని మాత్రమే చెప్పామని కేంద్ర జలశక్తి శాఖ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. అనంతరం ఎలాంటి షరతులు లేని ఉపసంహరణకు అనుమతిస్తామని, ఏవైనా అంశాలు ఉంటే కేంద్రాన్ని కోరాలని సూచిస్తూ ధర్మాసనం విచారణను ముగించింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు