కూరగాయల విషయంలో గొడవ.. భర్త మృతి

27 Dec, 2020 07:09 IST|Sakshi

చికిత్స పొందుతూ వ్యాయామ ఉపాధ్యాయుడు మృతి 

కూరగాయల విషయమై దంపతుల మధ్య తగాదా 

ఈ నెల 16న ఆత్మహత్యాయత్నం

పాలకొండ రూరల్ ‌: కూరగాయల విషయంలో దంపతుల మధ్య తలెత్తిన తగాదాతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీకాకుళంలోని జెమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) ఈశర్ల రామకృష్ణ (35) ఈ నెల 25వ తేదీ రాత్రి మృతి చెందారు. పాలకొండ గాయత్రీనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంపటాపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణకు 2008లో నిర్వహించిన మెగా డీఎస్సీలో పీఈటీగా ఉద్యోగం లభించింది. 2017లో వీరఘట్టం పట్టణానికి చెందిన సంధ్యారాణితో వివాహమైంది. వీరికి మూడేళ్లలోపు ప్రణీత, నితిన్‌ పిల్లలున్నారు.

పాలకొండలోని గాయత్రీనగర్‌ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ నెల 16వ తేదీన ఇంటికి బంధువులు రావటంతో కూరగాయలు తెమ్మని భార్య సంధ్యారాణి కోరింది. ఆయన వెళ్లి కూరగాయలు తీసుకురాగా.. అవి బాగోలేవని భార్య చెప్పడంతో వారి మధ్య మాటామాట పెరిగింది. భోజనం మానేసిన ఆయన ఇంటి హాల్‌లో పడుకోగా సంధ్యారాణి ప్లిలలకు పాలిచ్చేందుకు వేరే గదిలో ఉండిపోయారు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో గ్యాస్‌ సిలిండర్‌ కిందకు పడిన శబ్ధం రావటంతో వెళ్లి చూసిన ఆమె రామకృష్ణ ఉరివేసుకున్నట్లు గుర్తించి కేకలు వేయటంతో బంధువులు, చుట్టుపక్కల వారు వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న ఆతన్ని 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆదే రోజు రాత్రి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. ఎనిమిది రోజుల చికిత్స అనంతరం రిమ్స్‌ వర్గాలు మెరుగైన వైద్యం కోసం ఈ నెల 24న రాగోలు జెమ్స్‌కు రిఫర్‌ చేయగా.. శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందారు. రామకృష్ణ మృతదేహాన్ని శుక్రవారం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై సీహెచ్‌ ప్రసాద్‌ తెలిపారు. రామకృష్ణకు 2018లో పీడీగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం బూర్జ మండలం ఓవీపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ.. బలవన్మరణానికి పాల్పడి విషాదాన్ని మిగిల్చారు.  పీడీగానే కాకుండా దళిత సంఘ నాయకునిగా హక్కుల సాధన పోరాటాల్లో చురుగ్గా పాల్గొనే రామకృష్ణ మృతిపై దళిత హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు సంతాపం తెలియజేశారు. 

మరిన్ని వార్తలు