భారతీయుల ‘ఫేస్‌బుక్‌’ వివరాలు ఆన్‌లైన్‌లో

6 Apr, 2021 05:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ఏకంగా 61 లక్షల మంది భారతీయుల ‘ఫేస్‌బుక్‌’ ఖాతా వివరాలు లీక్‌ అయ్యాయి. ఫేస్‌బుక్‌ అకౌంట్‌లకు సంబంధించిన ఫోన్‌ నంబర్లు, పేర్లు ఆన్‌లైన్‌లో హ్యాకింగ్‌ వేదికల్లో అందుబాటులోకొచ్చాయని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ హడ్సన్‌ రాక్‌ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ అలోన్‌ గాల్‌ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 53.3 కోట్ల ఫేస్‌బుక్‌ యూజర్‌ల వివరాలు హ్యాకింగ్‌ ఫోరమ్‌లలో ఉచితంగా లభిస్తున్నాయని ఆయన ట్వీట్‌ చేశారు. ఆన్‌లైన్‌లో లీక్‌ అయిన అకౌంట్లను దేశాలవారీగా చూస్తే 61 లక్షల మంది భారతీయుల అకౌంట్లు, 3.23 కోట్ల అమెరికన్‌ దేశీయుల అకౌంట్లు, బ్రిటన్‌కు చెందిన కోటీ 15 లక్షల ఖాతాలు, ఆస్ట్రేలియాకు చెందిన 73 లక్షల యూజర్‌ అకౌంట్లు ఉచితంగా హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లేనని ఆయన అంచనావేశారు. లీక్‌ అయిన డాటాలో కోట్లాది యూజర్ల ఫోన్‌ నంబర్లు, ఫేస్‌బుక్‌ ఐడీలు, యూజర్ల పూర్తి పేర్లు ఉన్నాయి. వీటిని హ్యాకర్లు చేజిక్కించుకుని సోషల్‌ ఇంజనీరింగ్‌ స్కామింగ్, హ్యాకింగ్, మార్కెటింగ్‌కు పాల్పడే ప్రమాదముందని అలోన్‌ హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు