‘భారత్‌ జోడో యాత్రను నియంత్రించండి’.. కేరళ హైకోర్టులో పిటిషన్‌

21 Sep, 2022 09:46 IST|Sakshi

తిరువనంతపురం: కాంగ్రెస్‌ పార్టీని తిరిగి గాడినపెట్టేందుకు ‘భారత్‌ జోడో యాత్ర’ పేరిట పాదయాత్ర చేపట్టారు రాహుల్‌ గాంధీ. కొద్ది రోజులుగా కేరళలో యాత్రకు మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీకి షాక్‌ తగిలింది. భారత్‌ జోడో యాత్ర వల్ల రాష్ట్రంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, నియంత్రించాలంటూ కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కేరళలో ఈనెల 11వ తేదీన మొదలైన యాత్ర 18 రోజుల పాటు సాగనుంది. 

భారత్‌ జోడో యాత్రను రోడ్డుకు ఒకేవైపు ఉండేలా రెగ్యూలేట్‌ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిషనర్‌, న్యాయవాది కే విజయన్‌. యాత్రను రోడ్డుకు ఒకవైపు అనుమతించి, రెండోవైపు ట్రాఫిక్‌ వెళ్లేలా చూడాలన్నారు. భారత్‌ జోడో యాత్ర కారణంగా ఇటీవల జాతీయ రహదారిని నాలుగు గంటల పాటు మూసివేశారని, దాంతో సామాన్య ప్రాయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే.. ఈ యాత్ర కోసం భారీగా పోలీసులను మోహరించారని, ఆ ఖర్చు మొత్తం కాంగ్రెస్‌ పార్టీ బరించాలని, ప్రజల సొమ్మును వినియోగించకుండా చూడాలని కోరారు. కేరళ ప్రజా రహదారుల చట్టం 2011ను ఈ యాత్ర ఉల్లంఘిస్తోందని సూచించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: దేశ ప్రజల్లో బీజేపీ విద్వేషాన్ని వ్యాపింపజేస్తోంది: రాహుల్‌

>
మరిన్ని వార్తలు