Petrol Diesel Prices: డీజిల్‌పై స్వల్ఫ ఊరట.. మరింత పెరిగిన పెట్రోల్‌ ధర

12 Jul, 2021 09:02 IST|Sakshi

Petrol Diesel Prices  ముంబై: ఇంధన ధరల్లో స్వల్ఫ ఊరట. డీజిల్‌ ధర లీటర్‌కు 15 నుంచి 17 పైసలు తగ్గింది. అయితే పెట్రోల్‌ ధరల పెరుగుదల మాత్రం కొనసాగుతోంది. సోమవారం లీటర్‌కు 25 నుంచి 34 పైసల చొప్పున పెరిగింది. దీంతో రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. 

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.97.33పై.గా ఉన్న లీటర్‌ డీజిల్‌ ధర.. ప్రస్తుతం 97.19పై.కి చేరింది. ఇక పెట్రోల్‌ మాత్రం రూ.107.24పై. చేరుకుంది. దాదాపు రెండు నెలల తర్వాత డీజిల్‌ ధరలో తగ్గుదల చోటుచేసుకోవడం విశేషం. మే 4 నుంచి పెట్రోల్‌ ధరపై ఇది 39వ పెంపు. ఇప్పటికే రాష్రా‍్టలు కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 16 చోట్ల పెట్రోల్‌ రేట్లు సెంచరీ దాటేశాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ. 105కి చేరుకోగా, లీటరు డీజిల్‌ స్వల్ఫంగా తగ్గి రూ.97.86పై. కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడంతో.. పెంచుకుంటూ పోతున్నాయి చమురు కంపెనీలు.

రాబోయే రోజుల్లో..
ఒపెక్‌ దేశాల వైఖరితో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టే రాబోయే రోజుల్లో దేశీయంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడం ఖాయంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే తప్ప పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. కానీ,  సంక్షేమ పథకాలకు నిధులు కోసం నగదును సర్దుబాటు చేయాల్సి వస్తుండడంతో పెట్రో మంటలను అదుపు చేయలేకపోతున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ ‘కొత్త’ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో నిధులు ఆదా చేయాల్సిన అవసరం ఉందని, అందుకే పెట్రో భారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు చెప్పారాయన.

మరిన్ని వార్తలు