ప్ర‌మాద స్థ‌లం నుంచి క‌ద‌ల‌ని శున‌కాలు

10 Aug, 2020 17:18 IST|Sakshi

తిరువ‌నంత‌పురం: ఇడిక్కి జిల్లా మూనూరు స‌మీపంలోని రాజమలైలో భారీ వ‌ర్షాల కార‌ణంగా కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డి తేయాకు తోటల్లో ప‌ని చేసే కార్మికులు శుక్ర‌వారం జలసమాధి అయ్యారు. సుమారు 30 ఇళ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి. స‌హాయ‌క బృందాల గాలింపులో శనివారం 22 మృతదేహాలు బయట పడగా, ఆదివారం 20, సోమ‌వారం మ‌రో 7 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా 24 మంది కోసం అన్వేష‌ణ సాగుతోంది. అయితే ఈ ప్ర‌మాదం జ‌రిగిన నాటి నుంచి రెండు శున‌కాలు అదే ప్రాంతంలో త‌చ్చాడుతూ ఉన్నాయి. త‌మ య‌జ‌మానులు క‌నిపించ‌క‌పోవ‌డంతో అక్క‌డే ప‌డిగాపులు కాస్తున్నాయి. ప‌గ‌లూ రాత్రి తేడా లేకుండా ప్ర‌మాదం జ‌రిగిన చోటే ప‌స్తులుంటూ గ‌డుపుతున్నాయి. వాటి మౌన రోద‌న‌ను అర్థం చేసుకున్న సహాయ సిబ్బంది వాటికి ఆహారాన్ని ఇచ్చిన‌ప్ప‌టికీ అవి తిన‌డానికి నిరాక‌రించాయి. (తవ్వేకొద్దీ శవాలు..! )

గాలింపు చ‌ర్య‌ల్లో భాగంగా సిబ్బంది ఏదైనా శ‌వాన్ని క‌నుగొని వాటిని బ‌య‌ట‌కు తీస్తే వెంట‌నే ఈ శున‌కాలు అక్క‌డికి ప‌రుగెత్తుకుంటూ వెళ్లి వాస‌న చూసి అవి త‌మ యజ‌మాని కాద‌ని నిరాశ‌గా వెన‌క్కు వ‌స్తున్నాయి. మృత‌దేహాన్ని వెలికి తీసిన ప్ర‌తీసారి ఇదే తంతు జ‌రుగుతోంది. ఇది చూసి కొంత‌మంది మ‌నసు చలించిపోగా ఆ శున‌కాల‌ను వారి ఇంటికి తీసికెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. కానీ అవి అదే స్థ‌లంలో శిలా విగ్ర‌హంలా నిల‌బడుతూ రాన‌ని మొండికేశాయి.

త‌మ‌ను పెంచిన వ్య‌క్తులు ఎప్ప‌టికైనా తిరిగొస్తారేమో, ఎప్ప‌టిలాగే వాటితో ఆడుకుంటారేమోన‌ని దీనంగా ఎదురు చూస్తున్నాయి. ఈ దృశ్యం అక్క‌డి వారంద‌రినీ క‌దిలించివేస్తోంది. మ‌రోవైపు ఈ ప్ర‌మాదంలో మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.5 లక్షలను, గాయపడ్డ వారికి వైద్య సాయం అందిస్తామ‌ని కేర‌ళ‌ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అలాగే బాధితులు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఇవ్వనున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట‌ర్‌లో వెల్ల‌డించారు. (కేరళలో వర్షబీభత్సం)

మరిన్ని వార్తలు