కరోనా వ్యాక్సిన్‌కు తొలి దరఖాస్తు

7 Dec, 2020 05:02 IST|Sakshi

టీకా వినియోగానికి అత్యవసర అనుమతులివ్వండి

డీసీజీఐని కోరిన ఫైజర్, సీరమ్‌

న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌ తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ భారత్‌లో వినియోగానికి అత్యవసర అనుమతుల్ని మంజూరు చేయాలని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)ని కోరింది. ఇప్పటికే యూకే, బహ్రెయిన్‌లో  ఫైజర్‌ అనుమతులు పొందింది. కరోనా టీకా వినియోగం కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న మొదటి సంస్థ ఇదే కావడం విశేషం.  అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టీకా వినియోగం కోసం  శుక్రవారం  ఫైజర్‌ దరఖాస్తు చేసుకుందని డీసీజీఐ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌  కోవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియో గానికి అనుమతులు ఇవ్వాలని సీరం ఇన్‌స్టి ట్యూట్‌ కూడా ఆదివారం కేంద్రాన్ని కోరింది. నిబంధనల ప్రకారం ఔషధ వినియోగానికి అనుమతులు కోరితే 90 రోజుల్లో బదులివ్వాల్సి ఉంది. యూకే, బహ్రెయిన్‌లలో ఫైజర్‌ వ్యాక్సిన్‌  సత్ఫలితాలు ఇస్తే డీసీజీఐ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.

ప్రయోజనం ఎంత ?
భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ వినియోగం ఎంతవరకు ఉపయోగం అన్న దానిపై అనుమానాలున్నాయి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్‌ను మైనస్‌ 70 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో భద్రపరచాలి. సాధారణంగా భారత్‌లో వ్యాక్సిన్‌లన్నీ రెండు నుంచి ఆరు డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలోనే ఉంచుతారు. మన దగ్గర ఈ వ్యాక్సిన్‌ను భద్రపరిచే కోల్డ్‌ స్టోరేజీలు దొరకడం దుర్లభం.  అందుకే భారత్‌ మొదట్నుంచి ఫైజర్‌తో ఎలాంటి ఒప్పందాలు కానీ వ్యాక్సిన్‌ ప్రయోగాలు కానీ చేపట్టలేదని  అధికారులు వెల్లడించారు.  ఈ వ్యాక్సిన్‌ 95% సామర్థ్యంతో పని చేస్తుందని తేలినప్పటికీ ఈ సంస్థల మాతృదేశాలైన అమెరికా, జర్మనీలు ఇంకా అనుమతులివ్వలేదు. జనవరి నుంచి నెలకి 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు వ్యాక్సిన్‌ డోసులు ఉత్పత్తి చేస్తామని ఫైజర్‌ సంస్థ చెప్పింది. దీంతో  భారత్‌ అవసరాలకు సరిపడా డోసులు ఉత్పత్తి, పంపిణీ చేయడం ఫైజర్‌ ఇప్పట్లో చేయడం కష్టమేనని కరోనాపై జాతీయ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌  వీకే పాల్‌ ఇప్పటికే అనుమానం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు