డీసీజీఐ అనుమతి కోరిన ఫైజర్

6 Dec, 2020 12:52 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌-19 టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ‘భారత ఔషధ నియంత్రణ జనరల్‌’ (డీసీజీఐ)ని అమెరికా ఫార్మా కంపెనీ ఫైజ‌ర్  కోరింది. ఈ టీకాను ఇప్పటికే యునైటెడ్ కింగ్‌డమ్, బహ్రెయిన్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. భారతదేశంలో 96 లక్షలకు పైగా ప్రజలను ప్రభావితం చేసిన మహమ్మారి కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనే రేసులో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న తొలి వ్యాక్సిన్‌ ఇదే కావడం విశేషం. డిసెంబర్ 4న సమర్పించిన తన దరఖాస్తులో ఫైజర్ ఇండియా ‘వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుని విక్రయించడానికి, పంపిణీకి అనుమతించాలని, భారత ప్రజలపై క్లినికల్‌ పరీక్షల నిర్వహణ కోసం ఆవశ్యకతను ప్రత్యేక నిబంధనల కింద రద్దు చేయాలని దానిలో కోరింది’ అని పిటిఐ పేర్కొంది.  (కరోనా వైరస్‌: ఎన్నో వ్యాక్సిన్లు..)

కరోనా వ్యాక్సిన్‌పై ఫార్మా దిగ్గజం ఫైజర్‌ కీలక ప్రకటన చేసింది. తాము తయారు చేసిన వ్యాక్సిన్‌ 95 శాతం సేఫ్‌ అని ఫైజర్‌ ప్రకటించింది. తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాలను ఫైజర్‌ సంస్థ ఈయూకి అందించింది. ఈ వ్యాక్సిన్ కి మొదట అనుమతిచ్చిన మొదటి పాశ్చాత్య దేశంగా యుకె నిలిచింది. వ్యాక్సిన్ తయారీ, పంపిణీలకు జర్మన్ కంపెనీ బయో ఎన్టెక్ తోపాటు, చైనీస్ కంపెనీ ఫోజన్ తోనూ ఫైజర్ ఒప్పందాలు కుదుర్చుకుంది. తద్వారా యూరోపియన్ దేశాలు, ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్ ను సరఫరా చేయనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. యుకె దీనిని ముందుకు తీసుకెళ్లడం ఒక చారిత్రాత్మక క్షణం అని ఫైజర్ తెలిపింది. భారత్ లో కూడా ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. మెసంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఫైజర్ వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీలలో స్టోర్ చేయవలసి ఉంటుందని ఫార్మా నిపుణులు పేర్కొంటున్నారు. (వైరస్‌ ముప్పు సమసిపోలేదు..)


 

>
మరిన్ని వార్తలు