ఏ మాత్రం ఆలస్యం చేసినా ఇద్దరూ ఏమయ్యేవారో!

18 Jan, 2021 09:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రైలులో మహిళకు డెలివరీ చేసిన దివ్యాంగుడు

న్యూఢిల్లీ: ప్రసవ వేదనతో బాధ పడుతున్న హీరోయిన్‌ అక్కకి డెలివరీ చేస్తాడు హీరో. వీడియో కాల్‌లో డాక్టర్ సూచనలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న వస్తువుల సాయంతో బిడ్డను బయటకు తీసి ‘అమ్మ’లా ఆమెకు అండగా నిలుస్తాడు. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ ‘త్రీ ఇడియట్స్‌’ సినిమాలోని ఈ దృశ్యం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇలాంటి తరహా ఘటనే సంపర్క్‌ క్రాంతి కోవిడ్‌-19 స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. దివ్యాంగుడైన సునీల్‌ ప్రజాపతి(30) ఢిల్లీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. తన పెళ్లి తేదీ ఖరారు చేసుకునేందుకు శనివారం స్వస్థలం మధ్యప్రదేశ్‌కు బయల్దేరాడు. జబల్‌పూర్‌- మధ్యప్రదేశ్‌ రైలులో ప్రయాణం చేస్తున్న అతడికి రాత్రి ఓ మహిళ బిగ్గరగా ఏడ్వటం వినిపించింది. 

దీంతో వెంటనే బీ3 కోచ్‌లోకి పరిగెత్తుకువెళ్లి చూశాడు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ఎలాగైలా కాపాడాలను​కున్నాడు. ఆస్పత్రి తీసుకువెళ్లేంత సమయం లేదు.. పైగా ఆమెకు సాయం చేసేందుకు బోగీలో ఒక్క మహిళ కూడా కనిపించలేదు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సుపీరియర్‌ డాక్టర్‌ సుపర్ణ సేన్‌కు సునీల్‌ ఫోన్‌ చేశాడు. వీడియోకాల్‌లో డాక్టర్‌ చెప్పిన సూచనలు పాటిస్తూ మహిళకు ప్రసవం చేశాడు. శాల్‌(శాల్వ)కు ఉన్న దారాలు, ఓ ప్యాసింజర్‌ షేవింగ్‌ కిట్‌లో ఉన్న కొత్త బ్లేడ్‌ తీసుకుని ఆమెకు డెలివరీ చేశాడు. అనంతరం మథుర స్టేషన్‌లో రైలు ఆగగానే ఆర్పీఎఫ్‌ సిబ్బంది తల్లీబిడ్డను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిద్దరు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ఈ క్రమంలో మానవతా దృక్పథంతో తక్షణమే స్పందించిన సునీల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.(చదవండి: 20 నెలల చిన్నారి.. ఐదుగురికి కొత్త జీవితం

అప్పటికే రక్తస్రావం మొదలైంది..
ఈ విషయం గురించి ‘సూపర్‌ హీరో’ సునీల్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రైలు ఫరీదాబాద్‌ దాటిన తర్వాత భోజనం చేసేందుకు నేను బాక్స్‌ తెరిచాను. అప్పుడు ఓ మహిళ బాధతో కేకలు వేస్తున్న శబ్దం వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్లాను. ఆమెకు తోడుగా తన చిన్నారి కూతురు, సోదరుడు మాత్రమే ఉన్నారు. వాళ్లు దోమోకు వెళ్తున్నారట. తను పేరు కిరణ్‌ అని, జనవరి 20న ఆమెకు డెలివరీ డేట్‌ ఇచ్చినట్లు ఆమెతో ఉన్నవాళ్లు చెప్పారు. అయితే ప్రయాణం కారణంగానే ఆమెకు నొప్పులు వచ్చాయని తొలుత భావించా. అందుకే ఒకవేళ ఏదైనా సాయం కావాలంటే నన్ను పిలవమని చెప్పి వచ్చేశాను. కానీ ఆమెకు నొప్పులు తీవ్రమయ్యాయి. 

వెంటనే మళ్లీ అక్కడికి వెళ్లి, మా డాక్టర్‌కు ఫోన్‌ చేసి పరిస్థితి వివరించాను. సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించాలనుకున్నాం. కానీ అప్పటికే ఆమెకు రక్తస్రావం మొదలైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే డాక్టర్‌ సుపర్ణ సేన్‌కు వీడియోకాల్‌ చేశాను. ఆమె చెప్పినట్లుగానే డెలివరీ చేసేందుకు ప్రయత్నించాను. అదృష్టవశాత్తూ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రసవం జరిగింది. కానీ ఆ సమయంలో నా మనసు భయం, ఉత్సుకత వంటి మిశ్రమ భావనలతో నిండిపోయింది. అంతా మంచే జరిగినందుకు ఇప్పుడు సంతోషంగాఉన్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక సునీల్‌ ప్రదర్శించిన ధైర్యం గురించి డాక్టర్‌ సేన్‌ చెబుతూ.. ‘‘అతడికి హ్యాట్సాఫ్‌. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఇలాంటి డెలివరీని నేనెప్పుడూ చూడలేదు.

దివ్యాంగుడైన తను పని పట్ల పూర్తి నిబద్ధతతో ఉంటాడు. సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటాడు’’ అని ప్రశంసించారు. అదే విధంగా కిరణ్‌ స్పందిస్తూ.. ‘‘నాకు ఇలా ప్రసవం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఇప్పటికే మూడుసార్లు గర్భస్రావం అయ్యింది. అలాంటిది ఇప్పుడు నా బిడ్డను నేను చూసుకోగలిగాను. నాకు సాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నా’’ అని ఉద్వేగానికి లోనయ్యారు. 

మరిన్ని వార్తలు