Fact Check: 5జీ టెస్టింగ్ వ‌ల్లే కోవిడ్ సెకండ్ వేవ్‌..!

8 May, 2021 15:24 IST|Sakshi

వైర‌ల‌వుతోన్న ఆడియో క్లిప్‌

అవ‌న్నీ పుకార్లే:  పీఐబీ

న్యూఢిల్లీ: గ‌తేడాది మొదలైన క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. మ‌ధ్య‌లో కొద్ది రోజుల పాటు తెర‌పిచ్చిన‌ట్లు క‌నిపించిన‌ప్ప‌టికి.. ఆ త‌ర్వాత ప్రారంభ‌మైన సెకండ్ వేవ్ దేశాన్ని అల్ల‌క‌ల్లోలం చేస్తుంది. ప్ర‌తి రోజు ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆస్ప‌త్రుల బ‌య‌ట రోగులు బెడ్స్ కోసం నిరీక్షిస్తూ.. అలానే క‌ళ్లు మూస్తున్నారు. వైర‌స్ వ్యాప్తి ప్రారంభ‌మ‌య్యి ఏడాదిన్న‌ర కాలం గ‌డుస్తున్న‌ప్ప‌టికి ఇంత‌వ‌ర‌కు కోవిడ్‌ వ్యాప్తి ఎక్క‌డి నుంచి మొద‌లైంది అనే దాని గురించి స‌రైన స‌మాచారం లేదు. మ‌నతో స‌హా ప్ర‌పంచ దేశాల‌న్ని చైనానే వైర‌స్‌ని భూమ్మీద‌కు వ‌దిలిందని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తాజాగా క‌రోనా సెకండ్ వేవ్‌కు సంబంధించి ఓ ఆడియో క్లిప్‌ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ఏంటంటే.. 5జీ టెస్టింగ్ వ‌ల్ల‌నే వైర‌స్ సెకండ్ వేవ్ వ్యాప్తి ప్రారంభం అయ్యింద‌ని.. పైగా దీన్ని టెస్ట్ చేసిన రాష్ట్రాలు యూపీ, బిహార్‌, మ‌హారాష్ట్ర‌లో భారీ సంఖ్య‌లో జ‌నాలు మ‌ర‌ణించార‌ని ఆడియోక్లిప్‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో దీనిపై నిగ్గు తేల్చేందుకు ప్రెస్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ బ్యూరో (పీఐబీ) రంగంలోకి దిగింది. వీటిలో వాస్త‌వ‌మెంతో తేల్చేందుకు టెలికామ్ అధికారుల‌ను క‌లిసింది. 

ఈ వార్త‌ల‌పై టెలికామ్ అధికారులు ఆదోళ‌న వ్య‌క్తం చేశారు. ఇవ‌న్ని పుకార్ల‌ని స్ప‌ష్టం చేశారు. కోవిడ్ వ్యాప్తికి, 5జీ టెక్నాలజీకి సంబంధించిన పుకార్లపై టెలికాం పరిశ్రమ సంస్థ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేర‌కు సీఓఏఐ, టవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (టీఏఐపీఏ) శుక్రవారం సంయుక్త ప్రకటన విడుద‌ల చేశాయి. 

కోవిడ్ కేసులు పెరగడానికి 5జీ స్పెక్ట్రం ట్రయల్సే కార‌ణం అంటూ కొన్ని ప్రాంతీయా మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చ‌క్క‌ర్లు కొడుతున్న వార్త‌లు అవాస్త‌వం అని స్ప‌ష్టం చేశాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా స్పందించిందని.. 5 జీ టెక్నాలజీకి, కోవిడ్ -19 కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిందని సిఐఐఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ తెలిపారు.

చ‌ద‌వండి: శుభవార్త: త్వరలోనే నాలుగో వ్యాక్సిన్‌?!

మరిన్ని వార్తలు