మళ్లీ లాక్‌డౌన్.. 3 కోట్ల మందికి ముప్పు?‌

26 Nov, 2020 10:02 IST|Sakshi

రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే ఉపాధి కోల్పోయే వారి సంఖ్య

ముంబై, శివారు ప్రాంతాల్లో 10 లక్షల ఫ్యాక్టరీలు మూతపడే అవకాశం

తమ ఉద్యోగాలు మళ్లీ పోతావేమోనని పలువురి ఆందోళన

లాక్‌డౌన్‌ విధించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంలో పిల్‌

సాక్షి, ముంబై : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంతకుముందు విధించిన లాక్‌డౌన్‌తోనే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. జనజీవనం స్థంభించిపోయింది. ప్రజలు ఆర్థికంగా నష్టపోయి పేదరికంలో కూరుకుపోయారు. ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ స్థితికి వస్తోంది. ఫ్యాక్టరీలు తెరుచుకోవడంతో చాలా మందికి ఉపాధి దొరుకుతోంది. కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే తమ పరిస్థితి ఏంటని తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈసారి మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల మంది ఉపాధికి ముప్పు పొంచి ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 19 లక్షల సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలుండగా 6 వేల భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నింటిలో సుమారు మూడు కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. దీంతో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళన చెందుతున్నారు.

మొదటిసారి విధించిన లాక్‌డౌన్‌తో 10 లక్షల కార్ఖానాలు, వ్యాపారాలు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే ఆ అవన్నీ తెరుచుకొని పరిస్థితి కుదుటపడుతోంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే ఆ ఫ్యాక్టరీలు, వ్యాపారాలు పూర్తిగా మూతపడే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతున్నారు. ముంబై ఉప నగరాలతో పాటు థానే, నవీముంబైలలో పెద్ద ఎత్తున చిన్న, పెద్ద, మధ్య తరహా కంపెనీలు సుమారు 10 లక్షల వరకు ఉంటాయి. ఈ కంపెనీల్లో సుమారు 80 లక్షల మంది కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీటిలో నిత్యావసర సేవల్లోని కార్మికులు మినహా మిగతా కార్మికులు, సిబ్బంది అందరు లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలా ఇళ్లకు పరిమితి అయిన వారి సంఖ్య సుమారు 72 లక్షల వరకు ఉంటుంది.

ఈ కార్మికుల్లో సుమారు 12 నుంచి 15 శాతం మంది ఉద్యోగాలు పోయాయి. మళ్లీ ఇప్పుడిప్పుడే ఈ కార్యాలయాలు, కంపెనీలు తెరుచుకుని పరిస్థితి అదుపులోకి వస్తుంది. దీంతో చాలామంది ఉపాధి పొందుతున్నారు. అయితే అంతలోనే మళ్లీ లాక్‌ డౌన్‌ విధించే అవకాశాలున్నాయనే వార్తలతో ఈ కంపెనీలు, ఉద్యోగులు తీవ్ర భయాందోళనలో పడిపోయారు. ఈ విషయంపై ఎస్‌ఎంఈ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు చంద్రకాంత్‌ సాలుంకే మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటి వరకు సుమారు 25 నుంచి 30 శాతం చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే మాత్రం చాలా మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడనుంది. అదేవిధంగా ఆయా పరిశ్రమలు, కంపెనీలలో పనులు చేసే సిబ్బంది ఆర్థికంగా దెబ్బతింటారని చెప్పారు.

సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం! 
మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించకుండా ఆదేశాలు జారీ చేయాలని హర్షల్‌ మిరాశీ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. లాక్‌డౌన్‌ విధిస్తే మళ్లీ ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. దీంతో లాక్‌డౌన్‌ విధించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరినట్టు తెలిసింది. అయితే సుప్రీంకోర్టులో కాకుండా హైకోర్టులో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని ఆయనకు సుప్రీంకోర్టు సూచించినట్టు సమాచారం.   

మరిన్ని వార్తలు