పుణేలో పాక్షిక ఆంక్షల సడలింపు 

9 Aug, 2021 05:10 IST|Sakshi

ప్రకటించిన డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌

సాక్షి, ముంబై: పుణే, పింప్రి–చించ్‌వడ్‌ కార్పొరేషన్ల పరిధిలో లాక్‌డౌన్‌ ఆంక్షలను ప్రభుత్వం పాక్షికంగా సడలించింది. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, పుణే జిల్లా ఇన్‌చార్జి మంత్రి అజిత్‌ పవార్‌ ఆంక్షల సడలింపు ప్రకటన చేశారు. ఆగస్టు 9వ తేదీ నుంచే ఈ సడలింపులు అమల్లోకి వస్తాయని పవార్‌ వెల్లడించారు. దీంతో పుణే, పింప్రి–చించ్‌వడ్‌ కార్పొరేషన్ల పరిధిలోని వ్యాపార వర్గాలు, సామాన్య ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ ఇరు కార్పొరేషన్లలో రికవరీ రేటు గణనీయంగా పెరగడంతో పాటు కరోనా వైరస్‌ కూడా మెల్లమెల్లగా అదుపులోకి వస్తోంది.

దీంతో లాక్‌డౌన్‌ ఆంక్షలను పాక్షికంగా సడలించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పుణే జిల్లా ఇన్‌చార్జి మంత్రి  అజిత్‌ పవార్‌ తెలిపారు. సడలించిన నిబంధనల ప్రకారం ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు అన్ని రకాల షాపులు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఉంటుంది. హోటళ్లు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించనున్నారు. మాల్స్‌ రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి.

రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో నడుపుకోవచ్చని అజిత్‌ పవార్‌ వెల్లడించారు. అయితే, కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారిని మాత్రమే మాల్స్‌లోకి అనుమతించాలని పవార్‌ మాల్స్‌ యాజమాన్యాలకు సూచించారు. ఒకవేళ ప్రజల నిర్లక్ష్యం వల్ల పాజిటివిటీ రేటు 8 శాతాన్ని దాటితే సడలించిన ఆంక్షలను రద్దు చేస్తామని, మళ్లీ కఠిన ఆంక్షలను అమలు చేసేందుకు వెనుకాడబోమని పవార్‌ హెచ్చరించారు. ప్రజలు అందరూ మాస్క్‌ తప్పనిసరిగా ధరించాల్సిందేనని, భౌతికదూరం కచ్చితంగా పాటించాలని పవార్‌ విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ కోవిడ్‌ నియమాలను పాటించాలని ఆయన కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అజిత్‌ పవార్‌ హెచ్చరించారు.

బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించవద్దని పౌరులందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలోని ఉద్యానవనాలు ప్రస్తుతం అమలులో ఉన్న సమయానుసారంగానే తెరిచి ఉంటాయని వెల్లడించారు. పుణే, పింప్రి–చించ్‌వడ్‌ ప్రాంతాల్లో ఈత తప్ప మిగతా అన్ని క్రీడలకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఇక్కడి ప్రార్థనా మందిరాలు అన్నీ మూసే ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, తమ వ్యాపారాలు, కార్యకలాపాల వేళలను మార్చాలని పుణేలోని రెస్టారెంట్ల ఓనర్లు, వ్యాపారులు, మాల్‌ సిబ్బంది అసోసియేషన్లు డిమాండ్లు చేస్తూ గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే రాష్ట్రంలోని 25 జిల్లాల్లో కరోనా ఆంక్షలు సడలించిన ప్రభుత్వం లెవల్‌–3 జిల్లాలైన పుణే సహా మరో 9 జిల్లాలకు కరోనా ఆంక్షలను సడలించలేదు. కాగా, ప్రస్తుతం పుణేలో పాజిటివిటీ రేటు 3.3 శాతానికి తగ్గిందని అధికారులు తెలిపారు. పింప్రి–చించ్‌వడ్‌ కార్పొరేషన్‌లో కూడా çకరోనా పాజిటివిటీ రేటు 3.7 శాతానికి తగ్గిందని అక్కడి అధికారులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు