Pizza Delivery: చిరిగిన రూ.200 నోటు.. మరొకటి ఇవ్వండని అడిగినందుకు..

26 Aug, 2022 18:57 IST|Sakshi

లక్నో: చిరిగిపోయిన రూ.200 నోటు తీసుకునేందుకు నిరాకరించాడని పిజ్జా డెలివరీ బాయ్‌పై ఓ వ్యక్తి తుపాకితో కాల్చారు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. సచిన్ కశ్యప్(21) అనే యువకుడు  పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

బుధవారం రాత్రి 11 గంటల సమయంలో నదీమ్‌ తన ఫోన్‌లో పిజ్జా ఆర్డర్‌ చేశాడు. 11.30 నిమిషాలకు సచిన్‌ తన హహోద్యోగి రితిక్‌ కమార్‌తో కలిసి పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లాడు. ఆర్డర్‌ ఇచ్చేసి పేమెంట్‌ కింద వారి నుంచి రూ.200 నోటును తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఇద్దరు కలిసి ఓ షాప్‌కు వెళ్లి కూల్‌డ్రింక్‌ తీసుకున్నారు. అక్కడ కస్టమర్‌ ఇచ్చిన రూ. 200 నోటును షాప్‌ యాజమానికి ఇవ్వగా అతని ఈ నోటు చిరిగిపోయిందని తీసుకోను అన్నాడు.  దీంతో వెంటనే ఇద్దరు మళ్లీ నదీమ్‌ వద్దకు వచ్చి వేరే నోటు ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ నదీమ్ మరో నోటు ఇవ్వకుండా వారిపై సీరియస్ అయ్యాడు. 

ఇంతలోనే  ఇంట్లో నుంచి నదీమ్‌ సోదరుడు వచ్చి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో సచిన్‌పై కాల్పులు జరిపాడు. గన్‌ పేల్చిన శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన వెంటనే బాధితుడు సచిన్ కశ్యప్‌ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బరేలీలోని ప్రత్యేక వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. నదీమ్(27), అతని సోదరుడు నయీమ్ (29)ను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: ఆకాశంలో 175 సార్లు రివవర్స్‌ స్పిన్నింగ్‌.. తన రికార్డును తానే బ్రేక్‌ చేసుకొని

మరిన్ని వార్తలు