అబ్బో... ! ఎంత గొప్ప సాయమో కదా ?

30 May, 2021 16:17 IST|Sakshi

18 ఏళ్ల తర్వాతే అనాథ చిన్నారులకు స్టైపండ్‌ !

ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా ఆక్సిజన్‌ ఇవ్వలేని దుస్థితి

పాత పథకాలకే పీఎంకేర్స్‌ సాయం అంటూ కలరింగ్‌

ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశాంత్‌ కిశోర్‌ సెటైర్లు

న్యూఢిల్లీ : కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సాయంపై పెదవి విరిచారు పొలిటికల్‌ స్ట్రాటజిస్టు ప్రశాంత్‌ కిశోర్‌. ఎంత గొప్ప సాయం ప్రకటించారో అంటూ సెటైర్లు కూడా సంధించారు. ఈ మేరకు వరుసగా ట్వీట్లు చేశారు ప్రశాంత్‌ కిశోర్‌.

ఇప్పటి నుంచే పాజిటివ్‌గా ఫీల్‌..
కొవిడ్‌ సంక్షోభంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలపై సానుభూతి ప్రదర్శించడం ద్వారా మరోసారి తనదైన శైలిలో టిపికల్‌ మాస్ట్రర్‌ స్ట్రోక్‌ కొట్టారు నరేంద్ర మోదీ అంటూ ప్రశాంత్‌ కిశోర్‌ విరుచుకుపడ్డారు. ఇప్పుడు తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైన పిల్లలకు 18 ఏ‍ళ్లు వచ్చిన తర్వాత స్టైపండ్‌ ఇస్తామని ప్రకటించడమేంటని ప్రశ్నించారు. ప్రధాని ఇచ్చిన హామీకి ఇప్పటి నుంచే ఆ పిల్లలు చాలా పాజిటివ్‌గా ఫీల్‌ కావాలనుకుంటా అంటూ మోదీపై మరో వ్యంగ్యాస్త్రాన్ని ప్రశాంత్‌ కిశోర్‌ సంధించారు.
 
అటుఇటు తిప్పి
ఇప్పటికే అమల్లో ఉన్న విద్యాహక్కు చట్టం, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాలనే అటు ఇటు తిప్పి కొవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లలకు పీఎం కేర్స్‌ ద్వారా ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటూ ప్రధాని కలరింగ్‌ ఇచ్చారని ప్రశాంత్‌ కిశోర్‌ మండిపడ్డారు. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా దేశంలో యాభై కోట్ల మందికి లబ్ది జరుగుతుందని ప్రధాని హామీ ఇచ్చారని, కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో రోగులకు కనీసం బెడ్డు, ఆక్సిజన్‌ అందివ్వలేక పోయారంటూ కేంద్రంపై ప్రశాంత్‌  కిశోర్‌ నిప్పులు చెరిగారు. 
 
మాస్ట్రర్‌ స్ట్రోక్‌
నోట్ల రద్దు, సర్జికల్స్‌ స్ట్రైక్స్‌ నిర్ణయాలు ప్రధాని ప్రకటించినప్పుడు బీజేపీ శ్రేణులు వాటిని నరేంద్ర మోదీ మాస్ట్రర్‌ స్ట్రోక్స్‌గా అభివర్ణించారు. మోదీ తీసుకున్న నిర్ణయాలతో శత్రువులు కుదేలైపోయారంటూ భారీగా ప్రచారం చేశారు. ఒకప్పటి బీజేపీ ప్రచార అస్త్రమైన మాస్టర్‌ స్ట్రోక్‌ను ఈరోజు సెటైరిక్‌గా ప్రశాంత్‌ కిశోర్‌ ఉపయోగించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు