పన్నీర్‌ సెల్వానికి రాజకీయ పతనం తప్పదా..?

28 Jun, 2022 07:39 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో పన్నీర్‌సెల్వం రాజకీయ ప్రయాణం.. పతనం దిశగా సాగుతోందా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ పదవీకాలం ముగిసిన దశలో ఆ పార్టీ కోశాధికారి బాధ్యతల నుంచి పన్నీర్‌సెల్వంను తప్పించేందుకు రంగం సిద్ధమైంది.

ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతున్న తరుణంలో.. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వాహకుల సమావేశం సోమవారం జరిగింది. పళనిస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలనే అంశంపై కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఏక నాయకత్వంలో పార్టీని నడపాలని, పన్నీర్‌సెల్వను పక్కనపెట్టి పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలనే వ్యూహంతో ఈనెల 23వ తేదీన సర్వసభ్య సమావేశం జరిగింది.

అయితే, కన్వీనర్‌ హోదాలో ఎడపాడి ఆలోచనా విధానాలకు వ్యతిరేకంగా పన్నీర్‌సెల్వం 23 తీర్మానాలు ప్రవేశపెట్టారు. వీటిని వ్యతిరేకిస్తున్నట్లు ఎడపాడి వర్గం తేలి్చచెప్పడంతో పన్నీర్‌సెల్వం అలిగి వెళ్లిపోయారు. ఎడపాడి వర్గం కోర్కె మేరకు వచ్చేనెల 11వ తేదీన మళ్లీ సర్వసభ్య సమావేశం నిర్వహించేలా ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ అనుమతించారు. ఇక ఆ తరువాత నుంచి ఈపీఎస్, ఓపీఎస్‌ తన ఎవరికివారు పార్టీపై పట్టుకోసం మ్ముమర ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి? 
అన్నాడీఎంకే ప్రధాన కార్యవర్గ సమావేశాన్ని చెన్నైలోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రిసీడియం చైర్మన్‌ అధ్యక్షత వహించారు. ‘ఏక నాయకత్వమే’, ‘ప్రధాన కార్యదర్శి జిందాబాద్‌’ నినాదాలతో ఎడపాడికి ఆయన అనుచరులు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయం ప్రాంగణంలోని ఓ ఫ్లెక్సీలో ఉన్న పన్నీర్‌సెల్వం ఫొటోను ఎడపాడి వర్గం తొలగించింది. వచ్చేనెల 11వ తేదీన సర్వసభ్య సమావేశం జరిపితీరాలని తీర్మానించారు. సమన్వయ కమిటీ గడువు తీరినందున రానున్న సర్వసభ్య సమావేశంలో కోశాధికారి పదవి నుంచి పన్నీర్‌సెల్వంను తప్పించాలని కూడా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

పార్టీని నడిపేందుకు ఎడపాడిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించుకుని సర్వాధికారాలు ఇచ్చినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. పార్టీ కార్యాలయంలో ఎడపాడి సమావేశం జరుపుతున్న సమయంలో తేనీ జిల్లా పెరియకుళంలో ఉన్న పన్నీర్‌సెల్వం హడావిడిగా చెన్నైకి చేరుకుని తన మద్దతుదారులతో మంతనాలు జరిపారు. అన్నాడీఎంకేలో కుమ్ములాటను టీటీవీ దినకరన్‌ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎడపాడిని వ్యతిరేకించేవారు బహిరంగంగా పన్నీర్‌సెల్వంతో భేటీ కావచ్చు, ఇందులో రహస్యం అవసరం లేదని దినకరన్‌ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు తాము ఎలాంటి కుట్ర చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. అన్నాడీఎంకేకు ఏక నాయకత్వమే ఉండాలి, పార్టీ శ్రేణులే ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాలని శశికళ అన్నారు.   

సుప్రీంకోర్టులో ఓపీఎస్‌ కేవియట్‌
పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహణపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎవరైనా పిటిషన్‌ వేస్తే తమ వాదన కూడా వినాలని సుప్రీంకోర్టులో ఓపీఎస్‌ న్యాయవాది సోమవారం కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విషయంలో పార్టీ నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలని అందులో పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు