బాప్‌రే! రైలెక్కితే రూ.5.. ఎక్కకపోతే రూ.50

4 Apr, 2021 00:08 IST|Sakshi

రైల్వే తీరుపై ప్రయాణికుల సంఘటనల అసంతృప్తి 

సాక్షి, ముంబై: రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అలోచించాలని, ప్లాట్‌ఫారం చార్జీలు పెంచి ప్రయాణికులపై అదనపు భారం మోపడం సరైన పద్దతి కాదని రైల్వేపై ప్రయాణికుల సంఘటనలు మండిపడుతున్నాయి. లోకల్‌ రైళ్లలో ప్రయాణించేందుకు కనీస టికెట్‌ చార్జీ రూ.5 ఉండగా కేవలం ప్లాట్‌ఫారం టికెట్‌కు రూ.50 ఎలా వసూలు చేస్తున్నారని ప్రయాణికుల సంఘటన నిలదీసింది.

ప్లాట్‌ఫారం టికెట్‌పై రైళ్లలో ప్రయాణించేందుకు అవకాశమే లేదని, అయినప్పటికీ రూ.50 వసూలు చేయడమేంటని సంఘటన ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. రూ.5 చెల్లించి లోకల్‌ రైలు టికెట్‌ తీసుకుని ప్లాట్‌ఫారంపై వెళ్లడం గిట్టుబాటవుతుందని కొందరు భావిస్తున్నారని తెలిపింది. కాగా, రద్దీని నియంత్రించే మార్గం ఇదికాదని, అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అలోచించాలని రైల్వే అధికారులకు సూచించారు.

మార్చి నుంచే అమలు.. 
కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా రద్దీగా ఉండే ప్రముఖ ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ (సీఎస్‌ఎంటీ), దాదర్‌ టర్మినస్, కుర్లా టెర్మినస్, బాంద్రా టర్మినస్, ముంబై సెంట్రల్‌ తదితర ప్రధాన రైల్వే స్టేషన్లలో రైల్వే ప్లాట్‌ఫారాల చార్జీలు ఐదు రేట్లు పెంచింది. మొన్నటి వరకు రూ.10 ఉన్న ప్లాట్‌ఫారం చార్జీలను మార్చి ఒకటో తేదీ నుంచి ఏకంగా రూ.50 పెంచిన విషయం తెలిసిందే. అయితే రద్దీని నియంత్రించడానికి ప్రత్నామ్యాయ మార్గాలను అన్వేషించాలని సూచించింది. కాని స్వగ్రామాలకు, పర్యటనకు, పుణ్య క్షేత్రాలకు బయలుదేరే తమ బంధువులను సాగనంపేందుకు స్టేషన్‌కు వచ్చే వారి నుంచి ఇలా భారీగా ప్లాట్‌ఫారం చార్జీల వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని సంఘటన ప్రశ్నించింది. త్వరలో వేసవి సెలవులు, శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి.

పెద్ద సంఖ్య జనాలు స్వగ్రామాలకు, పర్యాటక ప్రాంతాలకు బయలుదేరుతారు. పిల్లపాపలు, వృద్ధులు, వికలాంగులు, భారీ లగేజీతో స్టేషన్‌కు వస్తారని తెలిపింది. వారిని సాగనంపేందుకు ఒకరిద్దరు దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు వస్తారని, కానీ, ప్లాట్‌ఫారం చార్జీలు రూ.50 చొప్పున వసూలు చేయడంవల్ల అనేక మంది స్టేషన్‌ బయట నుంచి తిరిగి వెళ్లిపోతున్నారని సంఘటన గుర్తుచేసింది. కాగా, రైల్వేస్టేషన్స్‌లో ప్రయాణికులతో పాటు అనవసరంగా జనం గుంపు కడుతున్నారని, జనాల రద్ధీని తగ్గించేందుకు రైల్వే ప్లాట్‌ఫారం టికెట్ల ధరలు పెంచేసి యాభై రూపాయలు చేసింది. ఈ పెంచిన ధరలు జూన్‌ 15 వరకు అమలులో ఉంటాయని మధ్య రైల్వే ప్రధాన పౌరసంబంధాల అధికారి శివాజీ సుతార్‌ ఇదివరకే తెలిపారు.  రద్దీని తగ్గించేందుకే రేట్లను పెంచామని  చెప్పారు.   

చదవండి: (వారంపాటు లాక్‌డౌన్‌.. కుటుంబాలు రోడ్డున పడతాయి)

మరిన్ని వార్తలు