NGO: శ్మశానాల్లో అధిక వసూళ్లా?

24 May, 2021 10:12 IST|Sakshi

మృతుల హక్కులను రక్షించండి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాప్తితో ఒకవైపు జనం అల్లాడుతుంటే మరోవైపు శ్మశానాల్లో అంత్యక్రియలకు అధికంగా డబ్బులు వసూలు చేస్తుండడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ఓ పిటిషన్‌ దాఖలైంది. అంబులెన్స్‌ సేవలకు కూడా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తుండడంపై పిటిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ కలెక్టివ్‌ ఇండియా అనే ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) ఈ వ్యాజ్యం దాఖలు చేసింది. చనిపోయిన వారికి కూడా హక్కులు ఉంటాయని పేర్కొంది. ఆ హక్కులను కాపాడేందుకు ఒక పటిష్టమైన విధానాన్ని రూపొందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరింది.

శ్మశానాల్లో కరోనా బాధితుల మృతదేహాల దహనానికి, ఖననానికి నిర్ధారిత రుసుము మాత్రమే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని విన్నవించింది. శ్మశానాల్లో అంత్యక్రియలకు అధిక రుసుములు చెల్లించలేక డబ్బుల్లేక కరోనా బాధితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు నదుల్లో వదిలేస్తుండడం బాధాకరమని వెల్లడించింది. అంబులెన్స్‌ సేవల విషయంలోనూ అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని ఎన్జీవో తన పిటిషన్‌లో పేర్కొంది.

(చదవండి: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌... పడవ పల్టీ)

>
మరిన్ని వార్తలు