ప్రజాస్వామ్యాన్ని రక్షించండి

31 Oct, 2022 05:14 IST|Sakshi
కార్యక్రమంలో సీజేఐతో మమత

సీజేఐకి మమత విజ్ఞప్తి

అధికారాలన్నింటినీ చెరబట్టారంటూ బీజేపీపై మండిపడ్డ బెంగాల్‌ సీఎం

కోల్‌కతా: ‘‘దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అధికారాలన్నింటినీ క్రమంగా అధికార పార్టీ నేతృత్వంలోని ఒకే ఒక వర్గం చెరబడుతోంది. ఈ పెడ ధోరణి ఇలాగే కొనసాగితే దేశం అంతిమంగా అధ్యక్ష తరహా పాలనలోకి వెళ్లేందుకు ఎంతో కాలం పట్టదు’’ అని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళన వెలిబుచ్చారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడేందుకు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. ఆదివారం నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జ్యూరిడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌యూజేఎస్‌) స్నాతకోత్సవంలో మమత పాల్గొన్నారు.

వర్సిటీ చాన్సలర్‌ అయిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌తో సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దయచేసి ప్రజాస్వామ్యాన్ని, దేశ సమాఖ్య వ్యవస్థను కాపాడండి’’ అంటూ సీజేఐని అభ్యర్థించారు. ఏ అంశంపై అయినా కోర్టుల్లో తీర్పు వెలువరించడానికి ముందే మీడియా సొంత తీర్పులు ఇచ్చేస్తోందంటూ మండిపడ్డారు. ‘‘వారు ఎవరినైనా నిందించొచ్చా? ఎవరి మీదైనా అభియోగాలు మోపొచ్చా? మా ప్రతిష్ట మాకు ప్రాణం. అది పోతే సర్వం పోయినట్టే. ఇలా మాట్లాడుతున్నందుకు మన్నించండి. తప్పయితే క్షమాపణలు చెబుతా. ప్రజలు న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయారని నేననడం లేదు. కానీ కొద్ది రోజులుగా పరిస్థితులు బాగా దిగజారుతున్నాయి. ప్రజలు నిశ్శబ్దంగా రోదిస్తున్నారు. వారి ఆక్రందనను న్యాయ వ్యవస్థ ఆలకించాలి. ఈ అన్యాయం బారి నుంచి కాపాడాలి’’ అని సీజేఐని కోరారు. 

మరిన్ని వార్తలు