పేదరికం వెక్కిరిస్తున్నా.. ఆ విద్యార్థి వెనుకడుగు వేయలేదు

15 Jul, 2021 08:08 IST|Sakshi
విమానంతో ముత్తుకుమార్‌ 

 ప్లస్‌టూ విద్యార్థి రూపకల్పన 

చెన్నై : బ్యాటరీతో పనిచేసే విమానాన్ని ప్లస్‌టూ విద్యార్థి రూపొందించి పలువురిని ఆశ్చర్యపరిచాడు. విరుదునగర్‌ జిల్లా, అమ్మన్‌పట్టికి చెందిన నారాయణస్వామి, సెల్వి దంపతుల కుమారుడు ముత్తుకుమార్‌ (17) ప్లస్‌టూ విద్యార్థి. తండ్రి నారాయణస్వామి మృతిచెందడంతో సెల్వి కూలి పనులు చేస్తూ ముత్తుకుమార్‌ను కముది హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో చదివిస్తోంది. ముత్తుకుమార్‌కు చిన్ననాటి నుంచే వైజ్ఞానిక ఆవిష్కరణలపై ఆసక్తి ఏర్పడింది. ఒకవైపు పేదరికంతో బాధపడుతున్నా మరోవైపు అన్వేషణలపై ఆసక్తి అతన్ని నిద్రలేకుండా చేసింది. గత ఏడాది మినీ విమానాన్ని తయారుచేయాలనే కోరిక కలిగింది. ఇందుకు కరోనా లాక్‌డౌన్‌ దోహదపడింది. ఆన్‌లైన్‌ క్లాసులు పూర్తికాగానే  తర్వాత మిగిలిన సమయంలో ఇంట్లోని వస్తువులతో ఆరు అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పున మినీ విమానాన్ని రాత్రింబవళ్లు తయారుచేశాడు.

ముత్తుకుమార్‌ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే విమానంలో ప్రయాణించాలని ఆశపడ్డానని, పేదరికంతో ఆ కోరిక తీరలేదన్నాడు. మేకలు మేపుతున్న సమయంలో విమానాన్ని తయారు చేయాలనే ఆలోచన కల్గిందని, పది నెలలకు పైగా విమానం రూపొందించినట్లు తెలిపాడు. కొన్ని వస్తువులు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశానని, త్వరలో అవి రాగానే విమానాన్ని నడుపుతానన్నాడు. ప్రభుత్వం సహకరిస్తే భవిష్యత్‌లో పెద్ద విమానాలు తయారుచేస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

>
మరిన్ని వార్తలు