‘ఉచితాల’ నుంచి దేశానికి విముక్తి కావాలి

23 Oct, 2022 05:20 IST|Sakshi

సాత్నా: దేశంలో సామాజిక–ఆర్థిక మార్పులకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ముఖ్యసాధనంగా మారిందని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ పథకం కింద నిర్మించిన ఇళ్లల్లో శనివారం గృహప్రవేశాలను ఆయన రిమోట్‌ నొక్కి ప్రారంభించారు. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో నినాదాలు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. పన్ను సొమ్మంతా ఉచితాల కింద పంచేస్తే ట్యాక్స్‌పేయర్లకు బాధ కలుగుతుందని పేర్కొన్నారు.

ఎంతోమంది పన్ను చెల్లింపుదార్లు తనకు లేఖలు రాశారని, ఉచితాలకు అడ్డుకట్ట పడాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఉచిత పథకాల నుంచి దేశం విముక్తి పొందాలని సమాజంలోని ఒక పెద్ద వర్గం ఆశిస్తుండడం సంతోషం కలిగిస్తోందన్నారు. పీఎంఏవై కింద దేశంలో గత ఎనిమిదేళ్లలో పేదలకు అన్ని వసతులతో కూడిన 3.5 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చామని వివరించారు. పేదలకు ఇచ్చిన ఇళ్లు వారికి కోటల్లాంటివని, వాటిలోకి పేదరికాన్ని అడుగు పెట్టనివ్వకూడదని ప్రధాని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు